Vice Presidential candidate: ఉపరాష్ట్రపతి  పదవికి అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఎన్డీఏ సిద్ధం అయింది. నామినేషన్లకు 21వ తేదీ చివరి రోజు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత అనూహ్యంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమయింది. ఈసీ వెంటనే ప్రక్రియ ప్రారంభించింది. 

ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మాత్రం గుంభనంగా తమ  కసరత్తు తాము పూర్తి చేసినట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  ఇప్పటికే ఎన్డీఏ పార్టీలన్నీ  ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎంపిక చేసినా తమకు సమ్మతమే అని తేల్చేశాయి. దీంతో బీజేపీ పార్లమెంటరీ బోర్డు లో మోదీ, షాలు పేరును ప్రకటించే అవకాశం ఉంది.  బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా.. ఎంపిక బాధ్యతను మోదీ, షాలకే ఇచ్చే అవకాశం ఉంది. వారు అసలు పేరును సోమవారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి 21వ  తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 

జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసిన తర్వాత చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. నితీష్ కుమార్ నుంచి.. వెంకయ్యనాయుడు పేరు వరకూ పరిశీలనలోకి వచ్చింది. ఇటీవల వెంకయ్యనాయుడు ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు.  అయితే ఎవరి పేరును ఫైనల్ చేయబోతున్నారో.. ప్రకటించిన తర్వాతే తేలుతుంది. ప్రచారంలోకి వచ్చిన పేర్లేవీ తుది రేసులో ఉండకపోవచ్చని అంటున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి  ధన్‌ఖడ్ ను ఎంపిక చేసినప్పుడు కానీ  . రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  పేరు కానీ ఆయా పదవులకు పోటీ పడేందుకు ఖరారు చేసినప్పుడు  వారి పేర్లు అసలు ప్రచారంలోకి రాలేదు. ఇప్పుడు  కూడా ఉపరాష్ట్రపతిగా  ఎవరూ ఊహించని అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది.  

ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలా వద్దా అన్నదానిపై ఇంకా ఇండీ కూటమి ఓ నిర్ణయానికి రాలేదు. ధన్‌ఖడ్ పై కాంగ్రెస్ పార్టీ సానుభూతి చూపిస్తోంది. పోటీ చేస్తే మాత్రం ఉపరాష్ట్రపతి పదవి ఏకగ్రీవం అయ్యే అవకాశం లేదు. ఓటింగ్ జరుగుతుంది. కానీ గెలిచే అవకాశం లేదు. ఓడిపోయేందుకే అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉంటుంది. బీజేపీ వివాదాస్పద అభ్యర్థిని  నిలబెడితే కాంగ్రెస్ కూటమి కూడా సీరియస్ గా తీసుకునే చాన్స ్ఉంది.  అయితే ఉపరాష్ట్రపతి పదవికి మోదీ, షాలు ఎవరిని ఖరారు చేస్తారో ఎన్టీఏ కూటమి పార్టీలకే కాంగ్రెస్ పార్టీకి కూడా అంతు చిక్కకుండా ఉంది.