Manish Sisodia : ఢిల్లీలో ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ధూషణలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జంగ్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న సమయంలో బీజేపీ తమ పార్టీలో చేరమని కోరిందని ఆరోపించారు. తాను వారితో చేరితే ఆప్ ఎమ్మెల్యేల కూటమిని విచ్ఛిన్నం చేసి తనను సీఎం చేస్తామని ఆ పార్టీ నేతలు తనకు హామీ ఇచ్చారని చెప్పారు.


మా పార్టీలో చేరితే మిమ్మల్ని సీఎం చేస్తాం 


'బీజేపీలో చేరండి, ఆప్ ఎమ్మెల్యేలను విడగొడతాం. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తాం' అని బీజేపీ నేతలు తనకు కోరారని మనీషా సిసోడియా చెప్పారు. "అరవింద్ కేజ్రీవాల్‌ను వదిలేయండి. ఒకవేళ మీరు ఈ ఆఫర్ నిరాకరిస్తే ఇలా జైల్లోనే ఉంటారు. బయటకు రాలేరు" అని బెదిరించినట్లు బీజేపీ నేతలపై సిసోడియా ఆరోపణలు చేశారు. "నేను ఆ సమయంలో జైల్లో ఇబ్బందులు పడుతున్నానని బీజేపీకి తెలుసు. నా భార్య అనారోగ్యంతో ఉందని, నా కొడుకు చదువుకుంటున్నాడని కూడా వారికి తెలుసు. ఆ టైంలోనే బీజేపీ నాకు ఓ అల్టిమేటం ఇచ్చింది. అదేంటంటే అరవింద్ కేజ్రీవాల్‌ను వదిలిపెట్టండి లేకపోతే జైలులో ఇలానే మగ్గిపోండి అన్నారు. ఇదే ఆ పార్టీ విధానం. వారు ఇతర పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేస్తారు. ప్రజల అవసరాలతో వాళ్లకు పట్టింపు లేదు. కేవలం అధికారం కోసమే ఆరాటపడతారు. వారి మాట వినకపోతే తప్పుడు కేసులతో జైలుకు పంపిస్తారు’’ అని సిసోడియా ఆరోపించారు.


తమ ఎజెండాతో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించిన ప్రతిపక్ష నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోందని సిసోడియా అన్నారు. ‘ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ పూనుకుంది. విడగొట్టలేని పక్షంలో వారిని జైలుకు పంపిస్తున్నారు’ అని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆప్ రాజకీయ పోరాటం వ్యక్తిగతంగా మారిందా అని అడిగిన ప్రశ్నకు, సమాధానంగా.. బీజేపీ మొదటి నుంచీ దీన్ని ఓ వ్యక్తిగత యుద్ధంగానే పరిగణిస్తోందని అన్నారు. ‘‘వారు పాఠశాలలు, ఆస్పత్రులు, నీరు, విద్యుత్ సౌకర్యాల గురించి పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకునే ఉంటే దశాబ్దాలుగా అధికారంలో ఉనన రాష్ట్రాల్లో పాఠశాలలు, ఆస్పత్రులో మంచి స్థితిలో ఉండేవి, ప్రజలకు సకాలంలో నీరు, విద్యుత్తు అందేవి’’ అని చెప్పుకొచ్చారు.


ప్రతిపక్ష నేతలపై దాడి చేసి జైలుకు పంపేందుకు దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. అవినీతికి పాల్పడిన వారిపై మాత్రమే దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పింది. 


ఇకపోతే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సిసోడియాను 2023లో అరెస్టు చేశారు. గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి ముందు ఆయన దాదాపు 17 నెలల కస్టడీలో గడిపారు. కాగా 70 నియోజకవర్గాలకు గానూ ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు.


Also Read : Republic Day 2025 : గణతంత్ర దినోత్సవం 2025 - 40 విమానాలతో అద్భుతమైన ఫ్లై పాస్ట్‌కు సిద్ధమైన వైమానిక దళం