Republic Day 2025 : ఈ ఏడాది జనవరి 26న నిర్వహించే గణతంత్ర వేడుకల్లో భారత వైమానిక దళం - ఐఏఎఫ్ (Indian Air Force) అద్భుతమైన వైమానిక ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఈ సారి కర్తవ్య పథ్‌లో నిర్వహించే రిపబ్లిక్ డే ఫ్లైపాస్ట్‌లో అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలతో సహా దాదాపు 40 విమానాలు పాల్గొంటాయని ఐఏఎఫ్(IAF) ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మరో ముఖ్య విషయమేమింటే, స్వదేశీంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ (ALH) ధ్రువ్, తేజస్ యుద్ధ విమానాలు ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో భాగం కావడం లేదు. ఈ విషయంపై వైమానిక దళం అందించిన సమాచారం ప్రకారం, గుజరాత్‌లో అయిన తర్వాత ALH ధ్రువ్ భూమిపైనే ఉండనుంది. ఈ సారి ఫ్లైపాస్ట్ కోసం ఉపయోగించడం లేదు. ఇక తేజస్ (Tejas) లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ విషయానికొస్తే, పనితీరు అద్భుతంగా ఉన్నప్పటికీ, దాని సింగిల్-ఇంజిన్ కాన్ఫిగరేషన్ కారణంగా ఫ్లైపాస్ట్ నుంచి మినహాయించారు. ఇక ఎప్పటిలాగే జాతీయ గీతం ఆలపించిన తర్వాత ఫ్లైపాస్ట్ (Fly fast) ప్రారంభమవుతుంది.
రిపబ్లిక్ డే పరేడ్‌లో ఫ్లైపాస్ట్
గణతంత్ర దినోత్సవ వేడుకలు నేషనల్ వార్ మెమోరియల్ (National War Memorial) వద్ద ప్రారంభమవుతాయి. ఆ తర్వాత 72 సంగీత విద్వాంసుల బ్యాండ్‌తో కూడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కవాతులో నలుగురు అధికారులతో సహా మొత్తం 144 మంది పాల్గొంటారు. ఇక ఫ్లైపాస్ట్‌లో 22 ఫైటర్ జెట్‌లు, 11 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, 7 హెలికాప్టర్లు తమ పరాక్రమాన్నిచూపనున్నారు. వాటిలో ముఖ్యమైనవి రాఫెల్, Su-30 MKI, C-130J హెర్క్యులస్. ఇవి దేశ రాజధానిపై విస్మయం కలిగించే వైమానిక నమూనాలను ఏర్పరుస్తాయి. "ఫ్లైపాస్ట్‌ను రెండు బ్లాక్‌లుగా విభజించారు. పరేడ్ తర్వాత బ్లాక్ 2 జరుగుతుంది. ఇందులో క్లిష్టమైన నిర్మాణాలు, విన్యాసాలు ఉంటాయి" అని వింగ్ కమాండర్ మనీష్ శర్మ తెలిపారు.
బీటింగ్ రిట్రీట్: గ్రాండ్ ఫైనల్
రిపబ్లిక్ పరేడ్‌లో జరిగే కవాతులో భారత సాయుధ దళాలతో పాటు ఇండోనేషియాకు చెందిన 160 మందితో కూడిన కవాతు బృందం, 190 మంది సభ్యుల బ్యాండ్ బృందం పాల్గొననుందని డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. అనంతరం జరిగే బీటింగ్ రిట్రీట్ (Beating Retreat) వేడుకలో వైమానిక దళం కూడా గ్రాండ్‌గా పాల్గొంటుంది. ఈ సమయంలో 128 మంది సంగీతకారులు దేశభక్తి ట్యూన్‌లతో తమ నైపుణ్యాలను ప్రదర్శించి గణతంత్ర వేడుకలకు మరో ఆకర్షణగా నిలుస్తారు.