Rajasthan Elections: ఇటీవల జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో.. బీఎస్పీకి చెందిన ముస్లిం ఎంపీ డానిష్ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరికి ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాబోయే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ప్రాధాన్యతమైన బాధ్యతలు అప్పగించింది. ఓ నియోజకవర్గ ఇంఛార్జీగా బీజేపీ పార్టీ నియమించింది. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ టోంక్ నియోజకవర్గం నుంచి పోటీలో దిగనున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో అక్కడ ఎలాగైన గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ.. అక్కడి పార్టీ బాధ్యతలను రమేష్ బిధూరికి అప్పగించింది.
స్పీకర్ తో సహా విమర్శలు గుప్పించిన ప్రతిపక్షాలు
ఇటీవల రమేష్ బిధూరి బీఎస్పీ ఎంపీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పీకర్ తో సహా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. స్పీకర్ కు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. పార్లమెంట్ చరిత్రలో మైనారిటీ వర్గానికి చెందిన సభ్యుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంది. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించింది కాంగ్రెస్. ఈ వివాదం నేపథ్యంలో రమేష్ బిధూరిపై బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నట్లు ప్రకటించింది. అంతలోనే రాజస్థాన్ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.
సౌత్ ఢిల్లీ ఎంపీగా ఉన్న రమేశ్ బిధూరి చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం కావడంపై మాట్లాడారు. ఆ సమయంలోనే BSPకి చెందిన కున్వార్ దనీష్ అలీ (Kunwar Danish Ali)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాది అంటూ మండి పడ్డారు. ముస్లిం ఎంపీ అయిన అలీపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సభలో అలజడి సృష్టించింది. వెంటనే స్పీకర్ ఓం బిర్లా ఆయనను మందలించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై దనీష్ అలీ స్పందించారు. కొత్త పార్లమెట్ సాక్షిగా తనను అవమానించారని అసహనం వ్యక్తం చేశారు. స్పీకర్ ఓం బిర్లాకి లేఖ కూడా రాశారు. పార్లమెంటరీ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. లోక్‌సభ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ లోని రూల్ 227 ప్రకారం నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు.