Khagen Murmu Kisses Woman: లోక్‌సభ ఎన్నికల ప్రచారం (Lok Sabha Elections 2024) అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బెంగాల్‌లో బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము (Khagen Murmu) ప్రచారంలో భాగంగా ఓ మహిళకు ముద్దు పెట్టడం వివాదాస్పదమవుతోంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతిపక్షాలు ఆ ఎంపీపై తీవ్రంగా మండి పడుతున్నారు. సోషల్ మీడియాలో వరుస పెట్టి పోస్ట్‌లు పెడుతున్నారు. చంచల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండగా శ్రీహిపూర్‌ గ్రామంలో ఓ మహిళ బుగ్గపైన ముద్దు పెట్టాడు ఎంపీ అభ్యర్థి. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతోంది. ఆ ఎంపీ తీరుపై మండి పడుతోంది. ఈ ఘటనకి, మహిళా రెజ్లర్ల లైంగిక ఆరోపణల కేసుకీ లింక్‌ పెడుతూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు తృణమూల్‌ నేతలు. బీజేపీ మహిళలకు వ్యతిరేకం అని తేల్చి చెబుతున్నారు. ఇలాంటి పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలంటూ చురకలు అంటిస్తున్నారు. బెంగాల్ సంస్కృతికి ఈ ఘటన మచ్చతెచ్చి పెట్టిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు అడగడానికి ఇలా దిగజారిపోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. బెంగాల్‌లో ఎవరు గెలవాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు. 




అయితే..ఈ వివాదంపై ఖగేన్ ముర్ము స్పందించారు. తన కూతురిలా భావించి ముద్దు పెట్టినట్టు వివరణ ఇచ్చారు. ఇందులో కూడా తప్పు తీస్తారా అంటూ మండి పడ్డారు. అనవసరంగా రాజకీయం చేస్తున్నారని అన్నారు. కూతురికి ముద్దు పెట్టడంలో తప్పేముందని ప్రశ్నించారు. తృణమూల్‌ నేతలే దిగజారి ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆ మహిళ కూడా స్పందించింది. ఇందులో తప్పేమీ లేదని చెప్పింది. 


"ఓ వ్యక్తి ఓ మహిళను కూతురిలా భావించి ముద్దు పెట్టుకోవడంలో తప్పేముంది. అసలు ఇందులో వచ్చిన సమస్య ఏంటి..? సోషల్ మీడియాలో అనవసరంగా ఇలాంటి ప్రచారాలు చేసే వాళ్లను పట్టించుకోవద్దు. ఖగేన్ ముర్ము నన్ను కూతురులా భావించారు. ఆయన నాకు ముద్దు పెట్టినప్పుడు అమ్మ నాన్న పక్కనే ఉన్నారు"


- మహిళ


ఇక యూపీలోనూ ఓ స్వతంత్ర అభ్యర్థి వింతగా ప్రచారం చేశాడు. మెడలో చెప్పుల దండ వేసుకుని ఇంటింటికీ తిరిగి ఓటు వేయాలని అందరినీ అడిగాడు. ఎన్నికల సంఘం అతనికి చెప్పులనే పోల్ సింబల్‌గా కేటాయించింది. అందుకే ఆ చెప్పులనే మెడలో వేసుకుని ప్రచారం చేశాడు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు బీజేపీ ఎంపీ మహిళకి ముద్దు పెట్టిన ఫోటో కూడా వైరల్ అవుతోంది. తృణమూల్ కాంగ్రెస్ విమర్శిస్తున్నా బీజేపీ మాత్రం ఎదురు దాడికి దిగుతోంది. 


 






Also Read: షర్ట్‌కి బటన్స్ లేవని మెట్రో ఎక్కనివ్వని సిబ్బంది, వీడియో వైరల్ - నెటిజన్‌లు ఫైర్