Viral Video: షర్ట్‌కి బటన్స్‌ లేవన్న కారణంగా బెంగళూరులో ఓ వ్యక్తిని మెట్రో ఎక్కనివ్వలేదు. కేవలం షర్ట్ సరిగ్గా లేదని తనని మెట్రో ఎక్కేందుకు సిబ్బంది అనుమతినివ్వలేదని ఆరోపించాడు ఆ వ్యక్తి. మెట్రో స్టేషన్‌లోకి వచ్చీ రాగానే సిబ్బంది ఆ ప్యాసింజర్‌ని ఆపేసింది. షర్ట్‌కి బటన్‌లు పెట్టుకోవాలని చెప్పింది. అంతే కాదు. మంచి బట్టలు వేసుకుని వస్తే తప్ప మెట్రో ఎక్కనిచ్చేది లేదని వారించారు. ఇది గమనించిన మిగతా ప్రయాణికులు ఇదంతా వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతకు ముందు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ రైతు మెట్రో ఎక్కేందుకు రాగా అతని దుస్తులు సరిగ్గా లేవని సిబ్బంది అడ్డుకుంది. మెట్రో ఎక్కనివ్వకుండా బయటకు పంపింది. ఈ ఘటన అప్పట్లో వివాదాస్పదమైంది. ఇప్పుడు మళ్లీ బెంగళూరు మెట్రో పరిధిలోనే ఇలాంటిదే జరగడం చర్చకు దారి తీస్తోంది. ఓ వ్యక్తి వేషధారణను చూసి జడ్జ్ చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మెట్రో సిబ్బంది ఇలా ప్రవర్తించడంపై మండి పడుతున్నారు.




అయితే ఈ విమర్శలపై బెంగళూరు మెట్రో స్పందించింది. ఎవరిపైనా తాము వివక్ష చూపించమని తేల్చి చెప్పింది. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని, అందుకే ఆపి ఉంటారని వివరణ ఇచ్చింది. అలాంటి వ్యక్తి మెట్రో ఎక్కితే మహిళలు, చిన్నారులు ఇబ్బంది పడతారని వెల్లడించింది. కౌన్సిలింగ్ ఇచ్చిన తరవాత మెట్రో ఎక్కేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిపింది.