Nehru Indira allowed CIA to install nuke device: నెహ్రూ, ఇందిరా అనుమతితో అమెరికా గూఢచార సంస్థ సీఐఏ నందాదేవి శిఖరంపై అణ్వస్త్ర పరికరం ఏర్పాటు చేసిందని బీజేపీ ఎంపీ నిషీకాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఝార్ఖండ్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన నిషికాంత్ దూబే మాజీ ప్రధానమంత్రులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. 1960వ దశకంలో చైనా అణ్వాయుధ కార్యకలాపాలను గమనించేందుకు అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కు హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణు శక్తితో నడిచే గూఢచారి పరికరాలను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారని ఆరోపించారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో దూబే వరుసగా ఈ ఆరోపణలు చేశారు. భారత మొదటి ప్రధాని నెహ్రూ 1964లో, ఇందిరా గాంధీ 1967, 1969లో అమెరికా సీఐఏతో కలిసి హిమాలయాల్లోని నందాదేవిపై చైనా గూఢచర్యం కోసం అణు శక్తితో నడిచే పరికరాలు ఏర్పాటు చేశారు. అమెరికన్లు పారిపోయి, అన్ని పరికరాలు అక్కడే వదిలేశారు అని ఆయన ప్రకటించారు.
ఈ పరికరాలు వదిలివేయబడటం వల్ల ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు గంగా నది ఒడ్డున నివసించే ప్రజల్లో క్యాన్సర్ వ్యాధి పెరుగుతోందని, హిమాలయాల్లో మంచు దిబ్బలు కరిగిపోవడం, క్లౌడ్ బర్స్ట్‌లు, ఇళ్లలో పగుళ్లు రావడం వంటి సమస్యలకు కారణమని దూబే ఆరోపించారు. కేదార్‌నాథ్ విపత్తు, తీస్తా నది వరదలు, గంగోత్రి-యమునోత్రి మంచు కరిగిపోవడం, గంగా నీటి మట్టం తగ్గడం వంటివి ఈ అణు పరికరాల లీకేజీ వల్లే జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ ఆరోపణలు 1960వ దశకంలో జరిగిన ఒక రహస్య ఆపరేషన్‌కు సంబంధించినవి. చైనా 1964లో తొలి అణు పరీక్ష చేసిన తర్వాత, అమెరికా సీఐఏ , భారత ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా "నందాదేవి ప్లూటోనియం మిషన్" పేరుతో ఆపరేషన్ చేపట్టాయి. ఉత్తరాఖండ్‌లోని నందాదేవి శిఖరం 7,816 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఆ శిఖరంపై ప్లూటోనియం శక్తితో నడిచే స్నాప్ జనరేటర్ ఏర్పాటు చేయడమే లక్ష్యం. ఇది చైనా అణు, మిస్సైల్ కార్యకలాపాలను గమనించేందుకు ఉపయోగపడుతుంది.
1965లో భారత-అమెరికా ఎక్స్‌పెడిషన్ బృందం పరికరాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ తీవ్ర మంచు తుఫాను వల్ల శిఖరానికి చేరలేదు. పరికరాలను తాత్కాలికంగా భద్రపరిచి తిరిగి వచ్చారు. 1966లో తిరిగి వెళ్లినప్పుడు అవి కనిపించలేదు . మంచు కొండచరియలు కూలిపోవడం వల్ల గల్లంతయ్యాయి. ఈ పరికరాల్లో ప్లూటోనియం-238 ఉండటం వల్ల రేడియేషన్ లీక్ అవుతుందనే ఆందోళనలు వచ్చాయి. 1967లో సమీపంలోని నందా కోట్ శిఖరంపై మరో పరికరం ఏర్పాటు చేశారు కానీ నందాదేవి పరికరం ఇప్పటికీ కనిపించలేదు. గంగా నది మూలాలు నందాదేవి మంచు దిబ్బల నుంచి వచ్చేవి కాబట్టి, రేడియేషన్ కలుషితం అయ్యే ప్రమాదం ఉందనే భయాలు ఉన్నాయి. అయితే శాస్త్రవేత్తలు ఇప్పటివరకు గంగాలో రేడియేషన్ గుర్తించలేదు.
1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ లోక్‌సభలో ఈ ఆపరేషన్‌ను అంగీకరించారు. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఈ విషయంపై వివరంగా నివేదిక ప్రచురించింది. దూబే ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ-గాంధీ పాలనపై విమర్శలకు ఉపోయగి్సతున్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబం విదేశీ శక్తులకు లొంగి దేశ ప్రయోజనాలను రాజీ చేశారు. పర్యావరణం, రైతులు, భవిష్యత్ తరాలకు హాని కలిగించారు అని ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.