New President for BJP: లోక్‌సభ ఎన్నికల ముందు వరకూ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు జేపీ నడ్డా. ఈ సారి మాత్రం ఆయనకు కేంద్ర కేబినెట్‌లో అవకాశమిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ క్రమంలోనే బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారన్న ఉత్కంఠ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా బీజేపీని బలపరచడంలో నడ్డా కీలక పాత్ర పోషించారు. ఆయా రాష్ట్రాల క్యాడర్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. అయితే...మోదీ ఈ నెల ఇటలీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన తిరిగి వచ్చిన తరవాతే కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ పార్లమెంటరీ బోర్డ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ని ఎన్నుకుంటుంది. అయితే...ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది. జేపీ నడ్డానే మళ్లీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేలా బోర్డు నిర్ణయం తీసుకునేందుకూ అవకాశముంటుంది. ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న పార్టీ నిబంధనను పక్కన పెడితే ఇది సాధ్యమే అని కొందరు చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నికలు జరిగే అవకాశముంది. అప్పటి వరకూ నడ్డాయే ఈ పదవిలో కొనసాగుతారనీ అంటున్నారు. అయితే..దీనిపై ఇంకా క్లారిటీ లేదు. 


కనీసం 50% రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు జరిగిన తరవాతే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్నది బీజేపీ రాజ్యాంగంలోని నిబంధన. దీంతో పాటు పార్టీలోకి సభ్యులను చేర్చుకునే క్యాంపెయిన్ కూడా భారీ ఎత్తున జరగనుంది. ఈ ఏడాది జులైలో ఇది మొదలవుతుంది. దాదాపు ఆరు నెలల పాటు ఇది కొనసాగుతుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశముంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌నే ఫుల్‌ టైమ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగించేందుకూ వీలుంటుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆయన పదవీ కాలం మొదలవుతుంది. 2019లో జేపీ నడ్డాని బీజేపీ పార్లమెంటరీ బోర్డు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంది. 2020లో జనవరిలో అధికారికంగా ఆయనను ఎన్నుకుంది. 2019 వరకూ ఈ పదవిలో అమిత్‌ షా ఉన్నారు. ఆ తరవాత ప్రధాని నరేంద్ర మోదీ జట్టులో హోం మంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తరవాత 2019లో జూన్ 17న జేపీ నడ్డా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకున్నారు. 2020 జనవరి 20న పూర్తి స్థాయిలో ప్రెసిడెంట్ అయ్యారు. ఈ ఏడాది జనవరితోనే ఆయన పదవీ కాలం ముగిసినప్పటికీ...లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జూన్‌ వరకూ పొడిగించారు.