మన శరీరానికి అన్నిరకాల విటమిన్లు అందాల్సిందే. వాటిలో ఏది తక్కువైనా ఆరోగ్యం అదుపుతప్పుతుంది. ముఖ్యంగా ‘విటమిన్ D’ తగ్గకుండా జాగ్రత్తపడాలి. దానివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తాజా పరిశోధనలో.. సంతాన సమస్యలకు కూడా ఆస్కారం ఉన్నట్లు తేలింది. పూర్తి వివరాలు మీ కోసం..


విటమిన్ D.. దీనికి సూర్యరశ్మి విటమిన్ అని కూడా అంటారు. ఇది కొవ్వులో కరిగిపోయే విటమిన్. ఇందులో D2, D3 అనే రెండు రకాల విటమిన్స్ ఉంటాయి. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ఈ పోషకం అత్యవసరం. రోగనిరోధక వ్యవస్థ సాధారణంగా పనిచేసేందుకు కూడా ఇది అవసరం.


చాలా అధ్యయనాలు విటమిన్ D లోపం మస్క్యూలోస్కెలెటల్, మెటబాలిక్, కార్డియోవాస్కులార్, ఆటోఇమ్యూన్ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వంటి అనేక రకాల అనారోగ్యాలకు కారణం కాగలదని చెబుతున్నాయి.


అయితే ఎలాంటి అనారోగ్యం లేని ఆరోగ్యవంతులకు విటమిన్ D పరీక్షలు.. స్క్రీనింగ్ మాదిరిగా చేయించే అవసరం లేదని యూఎస్ లోని ఎండోక్రైన్ సొసైటి వారు స్పష్టం చేశారు. కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఈ పరీక్ష సిఫారసు చెయ్యాలని తెలిపారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, 75 సంవత్సరాల పై వయసు కలిగిన వృద్ధులు, ప్రీడయాబెటిక్స్ మాత్రమే విటమిన్ D తీసుకోవాలని సిఫారసు చేశారు.


మనదేశంలో విటమిన్ D లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. విటమిన్ D ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు. గర్భిణులలో పిండం ఎదుగుదలకు ఇది ఎంతో కీలకం. ప్రీడయాబెటిస్ బాధితులకు షుగర్ వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది.


విటమిన్ D ఫెర్టిలిటి సమస్యలకు కారణం అవుతుందా?


విటమిన్ D లోపం పిల్లల్లో రికెట్స్ కు కారణమవుతుంది. పెద్దలలో ఆస్టియోపేనియా, ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు కూడా విటమిన్ D లోపంతో వస్తాయి. అయితే ఇటీవలి పరిశోధనలు విటమిన్ D లోపం సంతానసాఫల్య సమస్యలకు కారణం కాగలదట. స్త్రీలలో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఈ పోషకలోపం వల్ల తీవ్రమవుతుందట.



  • పురుషులలో విటమిన్ D లోపం వల్ల వీర్య నాణ్యత తగ్గడానికి, వంధ్యత్వానికి కారణం అయ్యే ప్రమాదం ఉంటుంది. నాణ్యమైన వీర్యం ఉత్పత్తికి విటమిన్ D అవసరమని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

  • గర్భందాల్చాలని అనుకుంటున్న స్త్రీలు గర్భధారణలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు విటమిన్ D సప్లిమెంటేషన్ ప్రారంభించడం అవసరం

  • వయసు పైబడిన వారిలో మరే ఇతర వృద్ధాప్య సమస్యలు రాకుండా ఉండడానికి కూడా విటమిన్ D సప్లిమెంట్లు అవసరమవుతాయి.

  • పిల్లలకు పాలిచ్చే తల్లులకు కూడా విటమిన్ D సప్లిమెంట్లు తీసుకోవాలి.

  • పెద్దలకు రోజుకు 800-1000 IU విటమిన్ D అవసరమవుతుంది. లోపం ఏర్పడితే అంతకంటే పెద్దడోసులో విటమిన్ D తీసుకోవాల్సి ఉంటుంది.


Also Read : రాక్‌సాల్ట్ vs సాధారణ ఉప్పు.. వీటిలో ఏది ఆరోగ్యకరం? ICMR సూచనల ప్రకారం ఏది బెటర్?












గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.