BJP Leader Parvesh Verma Declares Rs 110 Crore Net Worth: న్యూ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పర్వేష్ వర్మ విజయం సాధించారు. మామూలుగా అయితే ఈ విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆయన ఓడించింది పదేళ్లపాటు సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను. అలాగే పదేళ్ల పాటు సీఎంగా ఢిల్లీ దిగ్గజ నేతగా పేరు పొందిన షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ను. అలాగని ఈ పర్వేష్ వర్మ అనామకుడేమీ కాదు. మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. అందుకే ఆయన పేరు ఢిల్లీ సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. అందుకే ఆయనకు ఉన్న ఆస్తులపైనా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. 

పర్వేష్ వర్మ తన ఎన్నికల అఫిడవిట్‌లో తన కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.114 కోట్లుగా ప్రకటించారు. రెండుసార్లు బిజెపి ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వర్మ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.  వర్మ వ్యక్తిగత నికర విలువ రూ.89 కోట్లుగా ప్రకటించారు.  ఆయన భార్య స్వాతి సింగ్ ఆస్తుల నికర విలువ రూ.24.4 కోట్లుగా ఉంది. వారి కుటుంబ  ఆస్తులు రూ.114 కోట్లుగా అఫిడవిట్ లో ప్రకటించారు.  ఈ దంపతుల పిల్లలకు రూ.1 కోటి విలువైన చరాస్తులు ఉన్నాయి. వర్మ చరాస్తులు రూ.77.89 కోట్లు, స్థిరాస్తులు రూ.12.19 కోట్లు. స్వాతి సింగ్ చరాస్తులు రూ.17.53 కోట్లు, ఆమె స్థిరాస్తులు రూ.6.91 కోట్లు.

ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేసే సమయానికి వర్మ దగ్గర రూ.2.2 లక్షల నగదు ఉంది.  ఆయన భార్య దగ్గర రూ.50,000 ఉంది. ఆయన బ్యాంకు పొదుపు మొత్తం రూ.1.2 కోట్లు, ఆయన భార్య దగ్గర రూ.42 లక్షలు ఉన్నాయి. వర్మ దగ్గర షేర్లు, బాండ్లలో రూ.52.75 కోట్ల పెట్టుబడులు ఉండగా, ఆయన భార్య దగ్గర రూ.16 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. వర్మ దగ్గర రూ.17 లక్షల ఎన్‌ఎస్‌ఎస్, బీమా పెట్టుబడి ఉంది, ఈ విభాగంలో ఆయన భార్య పెట్టుబడి మొత్తం రూ.5.5 లక్షలు అని అఫిడవిట్ లో పేర్కొన్నారు.             పర్వేష్ వర్మ తండ్రి  సాహిబ్ సింగ్ వర్మ 1996 నుంచి 1998 మధ్య దిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మదన్‌లాల్ ఖురానా తరువాత సుమారు రెండున్నరేళ్లు దిల్లీ సీఎంగా పనిచేసిన ఆయన అనంతరం 1999లో ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు.  వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన ప్రవేశ్ దిల్లీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ 2013లో దిల్లీలోని మహరోలీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం 2014, 2019 లోక్‌సభ ఎన్నికలలో ఆయన పశ్చిమ దిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2014లో 2 లక్షల 68 ఓట్ల తేడాతో గెలిచిన ప్రవేశ్ 2019లో 5 లక్షల 78 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు సీఎం రేసులో ముందున్నారు. 

Also Read: జైలుకెళ్తే సీఎం అనే సెంటిమెంట్ బ్రేక్ - కనీసం ఎమ్మెల్యేల్ని కూడా చేయని ఢిల్లీ ప్రజలు !