Manoj Tiwari on Sisodia Arrest:


 
ఎవరు ఆ మాస్టర్‌మైండ్..? 


ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి.  అటు బీజేపీ మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందని స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్‌లో అసలైన మాస్టర్‌మైండ్ ఇంకా అరెస్ట్ కావాల్సి ఉందని అన్నారు. 


"చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దాదాపు 8 గంటల పాటు విచారణ తరవాతే లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియాను అరెస్ట్ చేశారు. ఆయన ఆ నేరం చేశారని మాత్రమే కాదు. అందుకు సంబంధించిన ఆధారాలను చెరిపే ప్రయత్నం చేశారు. అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. నిందితులెవరైనా సరే ఎప్పుడో ఒకప్పుడు దర్యాప్తు సంస్థలు వారి దగ్గరకు వెళ్తాయి. విచారిస్తాయి. మాస్టర్‌మైండ్‌ను ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. సిసోడియా అరెస్ట్‌ చాలా మంది ప్రజలకు సంతృప్తినిచ్చిందనే అనుకుంటున్నాను" 


-మనోజ్ తివారీ, బీజేపీ ఎంపీ


అటు ప్రతిపక్షాలు మాత్రం ఇది అనైతికం అంటూ విమర్శిస్తున్నాయి. సంజయ్ రౌత్ మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మండి పడ్డారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా  బీజేపీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ ఇలా ED, CBIలతో అరెస్ట్ చేయిస్తున్నారని అన్నారు. 


"హిమాలయాల్లో తపస్సు చేసుకునే సాధువులందరూ వచ్చి బీజేపీలో చేరారా..? వీళ్లే కదా LIC, SBIని పూర్తిగా కొల్లగొట్టింది. మనీశ్ సిసోడియా కావచ్చు. రాహుల్ గాంధీ కావచ్చు. వీళ్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందుకే వాళ్లపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. బీజేపీ ప్రతిపక్షాలను ఎంతగా అణిచివేస్తే అంతగా ఒక్కటై పోరాడతాం. మనీశ్ సిసోడియాకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం" 


- సంజయ్ రౌత్‌






ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆప్‌ పార్టీకి సంబంధించిన 80% మంది నేతల్ని కేంద్రం అరెస్ట్ చేయించిందని అసహనం వ్యక్తం చేశారు. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు జైలు పాలయ్యారని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి జరగడం బాధాకరమని చెప్పారు.