Rahul T shirt : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర విషయంలో బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అయితే అవన్నీ విధాన పరమైనవి. అయితే బీజేపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఓ ఫోటో పోస్ట్ చేసి.. రాహుల్ గాంధీ వాడుతున్న టీ షర్ట్ ఇంటర్నేషనల్ బ్రాండ్‌దని దాని ఖరీదు నలభై వేలపైనే ఉంటుందని ప్రకటించారు. అలాంటి ఖరీదైన డ్రెస్సులతో రాహుల్ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారని విమర్శించింది. భారత్ , దేఖో అని ట్వీట్ చేసింది.
వెంటనే కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ సొంత సొమ్ముతో దుస్తులు కొనుక్కుంటారని..కానీ ప్రధాని మోడీ డ్రెస్సింగ్ కోసం లక్షలు ఖర్చు పెడతారని అది కూడా ప్రజాధనమని విమర్శలు ప్రారంభించింది.
ఇతర కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ముగ్గురు ప్రధానులు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ ఓ మంచి టీ షర్ట్ ధరించడానికి అర్హుడు కాదా అని ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య టీ షర్ట్ పంచాయతీ జోరుగా సాగుతోంది. రెండు పార్టీల నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే కొంత మంది మాత్రం.. . దుస్తుల మీద పంచాయతీలు ఎందుకని ప్రజాసమస్యలు.. పెరిగిపోతున్న పన్నులు.. తగ్గిపోతున్న ఉపాధి పై ఎందుకు చర్చించరని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు మోదీ, రాహుల్ డ్రెస్‌ల ఖర్చులపై సోషల్ మీడియా హోరెత్తుతోంది.