Bihar Ram Navami Clash:


రామనవమి వేడుకల్లో గొడవ..


శ్రీరామ నవమి రోజున పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. గ్రూపులుగా విడిపోయి రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడుల్లో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, బిహార్‌లో పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. కేంద్ర బలగాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. కేంద్ర హోం శాఖ కూడా బిహార్‌లోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. రోహ్‌తస్, నలందా జిల్లాల్లో అలజడి ఇంకా కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. నలంద జిల్లాలోని బిహార్‌షరీఫ్ ప్రాంతంలో రెండు గ్రూపులు కొట్లాటకు దిగాయి. ఈ దాడుల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ససరం టౌన్‌లో అన్ని చోట్లా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదే ప్రాంతంలో బాంబు దాడి కూడా జరిగింది. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు ఘటనా స్థలం నుంచి ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్టు వివరించారు. నలందా జిల్లాలో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా చూసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రామ నవమి రోజున మొదలైన ఈ గొడవలు...రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. మరుసటి రోజు రెండు గ్రూపులు రాళ్లు రువ్వుకోవడం వల్ల గొడవ పెద్దదైంది. ఈ దాడులతో సంబంధం ఉన్న 80 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాపైనా పోలీసులు నిఘా పెట్టారు. ఉద్రేకపరిచే పోస్ట్‌లు పెట్టకుండా కట్టడి చేస్తున్నారు. కేంద్ర హోం శాఖ బిహార్‌కు అదనపు బలగాలు పంపింది. హోం మంత్రి అమిత్‌షా ససరం పర్యటనకు రావాల్సి ఉన్నా...ఈ గొడవల కారణంగా పర్యటన రద్దు చేసుకున్నారు. గవర్నర్‌కు ఫోన్ చేసి పరిస్థితులు సమీక్షించారు. 




అంతా వదంతులే..


ఈ గొడవల మధ్యే...హిందువులు తమ ఇళ్లు వదిలి పెట్టి వేరే చోటకు వెళ్లిపోతున్నారంటూ పుకార్లు పుట్టాయి. కొన్ని మీడియా ఛానళ్లు కూడా ఇదే ప్రచారం చేశాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసుల ఇవి వదంతులేనంటూ తేల్చి చెప్పారు. ఆధారాల్లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేయొద్దని వెల్లడించారు. ప్రజలు అలాంటి వదంతులు నమ్మొద్దని సూచించారు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టు వివరించారు.