Bihar Political Crisis Row: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరికాసేపట్లో సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీజేపీతో చర్చలు ముగిసినట్టు సమాచారం. అదే జరిగితే RJD,కాంగ్రెస్‌,జేడీయూ కూటమి కథ ఇక ముగిసినట్టే అవుతుంది. ఆ తరవాత బీజేపీ మద్దతుతో కలిసి నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మళ్లీ ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగుతారని ఇప్పటికే సన్నిహిత వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. సుశీల్ మోదీ డిప్యుటీ సీఎం పదవిని చేపట్టనున్నట్టు సమాచారం. నితీశ్ రాజీనామా నేపథ్యంలోనే సెక్రటేరియట్‌ని ఆదివారమైనా సరే తెరచి ఉంచాలని ఆదేశాలు అందాయి. ఇప్పటికే పట్నా వేదికగా నితీశ్ కుమార్ నేతృత్వంలో అందరి నేతలతో కీలక భేటీ జరిగింది. ఏ నిర్ణయం తీసుకున్నా తాము మద్దతునిస్తామని అందరు నేతలూ స్పష్టం చేశారు. ఫలితంగా...బీజేపీతో పొత్తుకు లైన్ క్లియర్ అయినట్టైంది. అయితే..అధికారికంగా నితీశ్ కుమార్‌ మహాఘట్‌బంధన్‌ నుంచి  బయటకు వస్తున్నట్టు ఓ ప్రకటన చేయాల్సి ఉంది. ఆయన ప్రత్యేకంగా ప్రెస్‌ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే గవర్నర్‌ని కలిసేందుకు ఆయన అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారట. తన రాజీనామా లేఖని గవర్నర్‌కి సమర్పించనున్నారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాక సాయంత్రం 4 గంటలకు ఆయన 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. 


అటు కాంగ్రెస్, RJD,బీజేపీ వరుస పెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నాయి. భవిష్యత్ వ్యూహాలపై చర్చిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు జేడీయూ నేతలు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసినట్టు సమాచారం. ఆ పార్టీ వైఖరి వల్లే ఇదంతా జరిగిందని, సీట్ షేరింగ్ విషయంలో ఏ మాత్రం తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. అటు బీజేపీ కూడా కాంగ్రెస్‌ని టార్గెట్ చేసింది. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే నితీశ్ కుమార్ అంతగా ఆగ్రహంగా ఉన్నారని, అందుకే ఆయన మళ్లీ బీజేపీ వైపు వస్తున్నారని తేల్చి చెబుతోంది. బిహార్‌లో మారుతున్న రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నాయి. నితీశ్ ఎంతో చొరవ చూపించి ఏర్పాటు చేసిన I.N.D.I.A కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బిహార్‌లో మొత్తం 243 నియోజకవర్గాలున్నాయి. అందులో RJDకి అత్యధికంగా 79 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే..ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 122 మ్యాజిక్ ఫిగర్‌ని అందుకోవాలి. ఇక బీజేపీకి బిహార్‌లో 78 మంది ఎమ్మెల్యేలున్నారు. లెక్కల వారీగా చూస్తే..


RJD- 79 
BJP- 78
JD(U) - 45
కాంగ్రెస్ - 19
సీపీఐ (M-L) - 12 


ఇప్పుడు నితీశ్ మహాఘట్‌బంధన్ నుంచి బయటకు వస్తే తమకున్న 45 మంది ఎమ్మెల్యేలకు బీజేపీలోని 78 మంది ఎమ్మెల్యేలు తోడవుతారు. అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ కన్నా ఓ సీటు ఎక్కువే..అంటే 123 మంది ఎమ్మెల్యేలుంటారు.