Bihar Political Crisis: బిహార్ రాజకీయంలో మరో ట్విస్ట్- గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన నితీశ్!

ABP Desam   |  Murali Krishna   |  09 Aug 2022 12:58 PM (IST)

Bihar Political Crisis: బిహార్‌లో ప్రభుత్వ మార్పు ఖాయంగా కనిపిస్తోంది. జేడీయూ.. ఆ రాష్ట్ర గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరింది.

బిహార్ రాజకీయంలో మరో ట్విస్ట్- గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన నితీశ్!

Bihar Political Crisis: బిహార్‌ రాజకీయం క్షణానికో మలుపు తిరుగుతోంది. భారతీయ జనతా పార్టీ (BJP)కి హ్యాండ్ ఇచ్చి ఆర్‌జేడీ, కాంగ్రెస్‌తో నితీశ్ కుమార్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే వార్తలు ఊపందుకున్న తరుణంలో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. ఆ రాష్ట్ర గవర్నర్ ఫాగూ చౌహాన్ అపాయింట్​మెంట్ కోరింది నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ. 

ఎమ్మెల్యేలతో భేటీ

సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన పట్నాలో జేడీయూ శాసనపక్ష సమావేశం నిర్వహించారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా నితీశ్ నివాసంలో జరిగిన భేటీకి హాజరయ్యారు. మరోవైపు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఆర్జేడీ ఎమ్మెల్యేల భేటీకి వామపక్ష పార్టీలు కూడా హాజరయ్యాయి. 

నితీశ్ ఫైనల్ టచ్

ఆర్‌జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేలా నితీశ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్​ను కూడా ప్రభుత్వంలో భాగం చేసుకోవాలని నితీశ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై సోనియా గాంధీతో సీఎం నితీశ్ ఫోన్‌లో చర్చించినట్లు వార్తలు వచ్చాయి. 

మాకు ఓకే

నితీశ్ కుమార్.. భాజపాతో తెగదెంపులు చేసుకొని వస్తే తమకు ఎలాంటి సమస్య లేదని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా కాంగ్రెస్ కూడా అనుకూలంగానే స్పందించింది. మహాఘట్‌బంధన్‌లో నితీశ్ కుమార్ భాగమైతే బిహార్‌కు ఆయనే సీఎంగా కొనసాగుతారని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

నితీశ్ కుమార్ వస్తే మేం స్వాగతిస్తాం. మా పూర్తి మద్దతు ఇస్తాం. మహాఘట్‌బంధన్ సమావేశం జరుగుతోంది. ఒకవేళ నితీశ్ కుమార్ వస్తే మేం ఆయనే బిహార్ సీఎంగా కొనసాగేలా మా మద్దతు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇది సమావేశం పూర్తయిన తర్వాతే ప్రకటిస్తాం.                                                                  - అజిత్ శర్మ, కాంగ్రెస్ పక్ష నేత

నితీశ్ దూరం

చాలా కాలం నుంచి బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ఎన్‌డీఏ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2020 ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించి నితీశ్ అధికారంలోకి వచ్చినా.. మిత్రపక్షం భాజపాకి ఎక్కువ సీట్లు దక్కాయి. దీంతో నితీశ్‌‌పై ఆ పార్టీ పెత్తనం చెలాయిస్తుందనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగా పలుమార్లు నితీశ్ కుమార్ అసహనానికి గురవుతున్నారు. దీంతో నితీశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Post Independence Verdicts: స్వాతంత్య్రం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులు

Also Read: Chinese Phone Ban: చైనాకు మోదీ భారీ షాక్! ఆ బడ్జెట్ ఫోన్లపై బ్యాన్!

Published at: 09 Aug 2022 12:38 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.