Bihar News: బిహార్‌లో దారుణ ఘటన జరిగింది. బల్లి పడినట్లు అనుమానిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని బలవంతంగా తినిపించడంతో 200 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు.


ఇదీ జరిగింది


భాగల్పుర్‌లోని ఓ పాఠాశాలలో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు ట్యూషన్‌ క్లాసులకు వెళ్లగా అక్కడ ఒకరికి వాంతులయ్యాయి. కొద్దిసేపటికే మిగిలిన విద్యార్థులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పాఠశాల సమీపంలోని ఓ వైద్య కేంద్రానికి విద్యార్థులను తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.


బల్లి పడింది!


మధ్యాహ్న భోజనంలో బల్లి పడిందని అందుకే విద్యార్థులు అస్వస్థతగు గురయ్యారని కొంతమంది ఆరోపిస్తున్నారు. 8వ తరగతి విద్యార్థి ప్లేట్‌లో చనిపోయిన బల్లి కనిపించడంతో ఈ విషయాన్ని విద్యార్థులు.. ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లారట.


అయితే అది బల్లి కాదని వంకాయని విద్యార్థులకు ప్రిన్సిపాల్ చెప్పినట్లు సమాచారం. కొంతమంది విద్యార్థులు ఆహారం తినేందుకు ముందుకు రాకపోవడంతో పాఠశాల సిబ్బంది ఆహారం తినాలని వారిని బలవంతం చేసినట్లు సమాచారం. ఆ ఆహారం తిన్న తర్వాతే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


సీరియస్


ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విద్యార్థులు, తల్లిదండ్రులు చెప్పిందే నిజమైతే పాఠశాల అధికారులు, సిబ్బందిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని  విద్యా శాఖ తెలిపింది. పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది తప్పు చేసినట్లు తేలితే అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.