Election Commission releases Bihar election schedule: బీహార్ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. రెండుదశల్లో ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడతకు అక్టోబర్ పదో తేదీన, రెండో విడతకు పదమూడో తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. నవంబర్ 6వ తేదీన మొదటి విడత పోలింగ్ జరుగుతుంది. రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరుగుతుంది. నవంబర్ పధ్నాలుగో తేదీన కౌంటింగ్ జరుగుతుంది.
అభ్యర్థులు ఈ సారి ఆన్ లైన్‌లోనూ నామినేషన్లు, అఫిడవిట్లు సువిధ పోర్టల్‌లో దాఖలు చేయవచ్చు. ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నామని అన్ని పోలింగ్ బూత్‌లలో వెబ్ కాస్టింగ్ ఉంటుందని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. సోషల్ మీడియాపై ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు. బీహార్ ఎన్నికల నుంచి కొత్తగా 17 రకాల సంస్కరణలు తీసుకు వస్తున్నామని తెలిపారు. ఈవీఎంలలో మిస్ మ్యాచ్ అయితే రీకౌంటింగ్ తప్పనిసరి చేశామని తెలిపారు.
బీహార్‌లో 243 స్థానాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీహార్‌లో ఈ ఎన్నికల్లో 7.42 కోట్ల మంది ఓటర్లు ఓటు వేస్తారు. ఎన్‌డీఏ (బీజేపీ-జేడీయూ) మరోసారి అధికారంలోకి రావాలని, ఇండీ కూటమి (ఆర్‌జేడీ-కాంగ్రెస్) అధికారాన్ని చేజిక్కించుకోవాలని పోటీ పడుతున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 30న ఫైనల్ వోటర్ లిస్ట్ విడుదలైంది. దీనిలో 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. జూన్ 24 నాటికి 7.89 కోట్ల మంది ఉండగా, 65 లక్షల మంది పేర్లు తొలగించారు.
బీహార్‌కు చెందిన 75 లక్షల మంది బయటి రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్లారు. వారి ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పోలింగ్ బూతులో 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా ఏర్పాటు చేశారు. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓ) ఐడీ కార్డులు ధరిస్తారు. ఓటర్ల మొబైల్‌లు బూతు వెలుపల డిపాజిట్ చేయాలి. సెంట్రల్ ఆబ్జర్వర్లు 287 ఐఎఎస్, 58 ఐపీఎస్, 80 ఐఆర్‌ఎస్‌లు పోలింగ్ స్టేషన్లను పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి నీతిష్ కుమార్ నాయకత్వంలోని ఎన్‌డీఏ (బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీ-రామ్ విలాస్) అధికారాన్ని కాపాడుకోవాలని పోరాడుతోంది. ఆర్‌జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ఈ సారి అధికారాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ ఆగస్టులో పాదయాత్రలు, ప్రియాంక గాంధీతో ర్యాలీలు నిర్వహించారు. జన్ సురాజ్ పార్టీ పేరుతో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కూడా రంగంలో ఉన్నారు. దీంతో బీహార్ ఫలితంపై ఆసక్తి ఏర్పడింది.
గత నాలుగు పర్యాయాలను పరిశీలిస్తే, బీహార్‌లో అత్యధిక దశల పోలింగ్ 2010లో ఆరు దశల్లో జరిగింది. ప్రతిసారీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2005 నుంచి 2020 వరకు ఉన్న డేటాను ఇక్కడ చూడండి.
సెప్టెంబర్ 3, 2005న ఎన్నికల తేదీలను ప్రకటించారు. బీహార్‌లో ఎన్నికలు నాలుగు దశల్లో జరిగాయి. ఫలితాలు నవంబర్ 22, 2005న ప్రకటించగా, ముఖ్యమంత్రి నవంబర్ 24, 2005న ప్రమాణ స్వీకారం చేశారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?దశ 1 - అక్టోబర్ 18, 61 సీట్లుదశ 2 - అక్టోబర్ 26, 69 సీట్లుదశ 3 - నవంబర్ 13, 72 సీట్లుదశ 4 - నవంబర్ 19, 41 సీట్లు
2010 ఎన్నికలను పరిశీలించండి
2010 అసెంబ్లీ ఎన్నికలను గుర్తుచేసుకుంటూ, ఎన్నికల తేదీలను సెప్టెంబర్ 6న ప్రకటించారు. 2010 ఎన్నికలు ఆరు దశల్లో జరిగాయి. ఫలితాలు నవంబర్ 24, 2010న ప్రకటించారు. ఆయన నవంబర్ 26, 2010న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
దశ 1 - అక్టోబర్ 21, 47 సీట్లుదశ 2 - అక్టోబర్ 24, 45 సీట్లుదశ 3 - అక్టోబర్ 28, 48 సీట్లుదశ 4 - నవంబర్ 1, 42 సీట్లుదశ 5 - నవంబర్ 9, 35 సీట్లుదశ 6 - నవంబర్ 20, 26 సీట్లు
2015 ఎన్నికలను పరిశీలించండి
సెప్టెంబర్ 9, 2015న ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఐదు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఫలితాలు నవంబర్ 8, 2015న ప్రకటించారు. ఆయన నవంబర్ 20, 2015న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
దశ 1 - అక్టోబర్ 12, 49 సీట్లుదశ 2 - అక్టోబర్ 16, 32 సీట్లుదశ 3 - అక్టోబర్ 28, 50 సీట్లుదశ 4 - నవంబర్ 1, 55 సీట్లుదశ 5 - నవంబర్ 5, 57 సీట్లు
2020 ఎన్నికలను పరిశీలించండి
సెప్టెంబర్ 25, 2020న ఎన్నికల తేదీలను ప్రకటించారు. మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఫలితాలు నవంబర్ 10, 2020న ప్రకటించారు. ముఖ్యమంత్రి నవంబర్ 16, 2020న ప్రమాణ స్వీకారం చేశారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?దశ 1 - అక్టోబర్ 28, 71 సీట్లుదశ 2 - నవంబర్ 3, 94 సీట్లుదశ 3 - నవంబర్ 7, 78 సీట్లు