CM Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ I.N.D.I.A కూటమి నుంచి బయటకు రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకే ఒక్క రోజులో ఆయన మహాఘట్‌బంధన్‌కి గుడ్‌బై చెప్పడం ఆ తరవాత NDAతో చేతులు కలపడం చకచకా జరిగిపోయాయి. ఉదయం రాజీనామా చేసి సాయంత్రానికల్లా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్,జేడీయూ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కూటమి ఏర్పాటు చేసి కాంగ్రెస్ సైడ్ అయిపోయిందని, ఏ మాత్రం పట్టించుకోవడం లేదని గతంలో చాలా సార్లు నితీశ్ అసహనం వ్యక్తం చేశారు. కానీ...కాంగ్రెస్ మాత్రం ఈ వ్యాఖ్యల్ని కొట్టిపారేసింది. కేవలం ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగానే కొన్నాళ్ల పాటు మౌనంగా ఉండిపోయామని స్పష్టం చేసింది. కానీ...అక్కడితో మొదలైన విభేదాలు ముదిరాయి. చివరకు ఆయన కూటమి నుంచి బయటకు వచ్చేంత వరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే నితీశ్ కుమార్ మరోసారి విపక్ష కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పేరు దగ్గరి నుంచి సీట్‌ల షేరింగ్ వరకూ అంతా వాళ్లకు ఇష్టమొచ్చినట్టే చేసుకున్నారని, తమకు విలువ ఇవ్వలేదని తేల్చి చెప్పారు.
"ప్రతిపక్ష కూటమికి వేరే పేరు పెడదామని ప్రతిపాదించాను. కానీ వాళ్లు నా మాట వినలేదు. అప్పటికే నిర్ణయం తీసుకున్నారు. నేనే చాలా సూచనలు చేశాను. వాళ్లు ఏమీ పట్టించుకోలేదు. ఏయే పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుందన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. అందుకే నేను ఆ కూటమి నుంచి బయటకు వచ్చేశాను. బిహార్ ప్రజల కోసం నేను ఎంతైనా శ్రమిస్తూనే ఉంటాను"
- నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి
అటు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ సీట్ల పంపకాలపై స్పందించారు. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. కూటమిలో మూడు పెద్ద పార్టీలున్నాయని, వాళ్లు ఒంటరిగా పోటీ చేసేటట్టైతే ఈ పాటికే ప్రకటన చేసే వాళ్లని అన్నారు.
"ఇప్పటి వరకూ సీట్ షేరింగ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కూటమిగా ఉన్నప్పుడు అందరూ ఒకే అభిప్రాయంతో ఉండాలి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. కూటమిలోని పార్టీలు ఒంటరిగా పోటీ చేసేటట్టైతే వాళ్లు అధికారికంగా ప్రకటించాలి. I.N.D.I.A కూటమి కలిసికట్టుగా పోరాడుతుందన్న నమ్మకం మాకుంది"
- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత