I.N.D.I.A Alliance: విపక్ష కూటమి I.N.D.I.Aకి పెద్ద షాక్ తగిలేలా ఉంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూటమిని వదిలే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన మళ్లీ బీజేపీతోనే కలిసి నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇప్పటికే విపక్ష కూటమి I.N.D.I.Aలో అప్పుడే చీలికలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌తో సీట్‌లు పంచుకునేందుకు ససేమిరా అంటున్నాయి తృణమూల్, ఆప్. మమతా బెనర్జీ అయితే ఏకంగా ప్రకటనే చేశారు. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసే ఉద్దేశమే లేదని తేల్చి చెప్పారు. అటు ఆప్ కూడా కాంగ్రెస్‌తో సీట్‌లు పంచుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇప్పుడు మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్‌ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్నారు. జనవరి 30వ తేదీన ఈ యాత్ర బిహార్‌కి చేరుకుంటుంది. అయితే...ఈ యాత్రలో పాల్గొనేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తి చూపించడం లేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల సీట్‌ల షేరింగ్ విషయంలో నితీశ్ తీవ్ర అసహనంతో ఉన్నట్టు సమాచారం. అందుకే...యాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. సీట్ల కేటాయింపు(Seats allocation) అంశం మా వ్య‌క్తిగ‌తం. వేరే పార్టీ వారు మాకు ఆఫ‌ర్ ఇవ్వ‌డం ఎందుకు?  మాతో చ‌ర్చిస్తే అప్పుడు ఆలోచిస్తాం అని మ‌మ‌తా బెన‌ర్జీ(Mamatha benarjee) తెగేసి చెప్పారు. అనంత‌రం వెంట‌నే ఆమె మాట మార్చి.. తాము ఒంట‌రిగానే బ‌రిలో దిగుతున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. కాగా, బెంగాల్‌ రాష్ట్రంలో మొత్తం 47 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో క‌నీసం 10 స్థానాల్లో పోటీ చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ, మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం రెండు క‌న్నా ఎక్కువ సీట్లు ఇచ్చే ప‌రిస్థితి లేదు. దీంతో ఈ దిశగా కొన్నాళ్ల నుంచి వివాదం ర‌గులుతూనే ఉంది.


గతేడాది జులైలో NDAని ఓడించడమే లక్ష్యంగా I.N.D.I.A కూటమి ఏర్పడింది. ఈ కూటమి ఏర్పాటులో నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. సైద్ధాంతిక విభేదాలున్న పార్టీలను కలపడంలో చొరవ చూపించారు. ఆ తరవాత ఆయనే కాంగ్రెస్‌పై కాస్త అసహనం వ్యక్తం చేశారు. కూటమిలో కాంగ్రెస్‌ పెద్దగా చురుగ్గా ఉండడం లేదని అన్నారు. ఈ విమర్శలతో ఒక్కసారిగా కూటమిలో అలజడి రేగింది. ఆ తరవాత ఓ భేటీలో ప్రధాని అభ్యర్థిగా ఖర్గేని ప్రతిపాదించడంపైనా నితీశ్ చుర్రుబుర్రులాడారు. తనకు ప్రధాని అభ్యర్థిత్వంపై ఆసక్తి లేదంటూనే వేరే వాళ్ల పేరు ప్రతిపాదించిన వెంటనే ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రాహుల్ గాంధీ ఆయనకు కాల్ చేసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ...ఇప్పటికీ ఆ విభేదాలు సమసిపోనట్టే కనిపిస్తున్నాయి. అందుకే ఆయన కూటమిని వీడి మళ్లీ ఎప్పటిలాగే బీజేపీతో చేతులు కలిపేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. గత రెండు రోజుల్లోనే అటు మమతా బెనర్జీ, ఇటు ఆప్‌ కాంగ్రెస్‌కి షాక్ ఇచ్చాయి. ఇప్పుడు నితీశ్ కూడా అదే దారిలో నడిచే అవకాశాలున్నాయి. 2013 నుంచి దాదాపు 5 సార్లు నితీశ్ కుమార్ ఓ కూటమి నుంచి మరో కూటమికి మారుతూ వచ్చారు. NDA,మహాఘట్‌బంధన్ మధ్యే అటూ ఇటూ తిరుగుతున్నారు. 2022లో ఆయన NDA నుంచి బయటకు వచ్చి RJD మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మళ్లీ ఆయన మహాఘట్‌బంధన్‌ని వీడి NDAలో చేరిపోతారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 


Also Read: హనీమూన్‌కి గోవా తీసుకెళ్తానని అయోధ్యకి తీసుకెళ్లిన భర్త, విడాకుల కోసం కోర్టుకెళ్లిన భార్య