Bharat Bhushan Tiwari encounter death in Bhojpur Bihar: బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో 28 ఏళ్ల సామాజిక కార్యకర్త భారత్ భూషణ్ తివారీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారానికి, ప్రజా ఆగ్రహానికి దారితీసింది. ప్రభుత్వంపై సాషల్ మీడియా వేదికగా విమర్శలు చేసే తివారీని పోలీసులు పథకం ప్రకారమే కాల్చి చంపారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ప్రతిపక్షాలే కాకుండా అధికార బీజేపీ లోని అగ్రనేతలు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో నిష్పాక్షికమైన, పారదర్శకమైన స్వతంత్ర జుడీషియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
పోలీసుల వాదన.. అసలు ఏం జరిగిందంటే?
భోజ్‌పూర్ జిల్లా షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలౌతీ గ్రామానికి చెందిన భారత్ భూషణ్ తివారీ స్థానికంగా పేదలు, వరద బాధితుల సమస్యలపై సోషల్ మీడియా ద్వారా నిరంతరం గళమెత్తేవాడు. అయితే, జూన్ 17న తివారీ గ్రామంలో బహిరంగంగా తుపాకీతో తిరుగుతూ గాల్లోకి కాల్పులు జరుపుతున్నాడనే సమాచారంతో తాము ఎస్టీఎఫ్ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లామని పోలీసులు చెప్తున్నారు. అతడిని లొంగిపోవాలని కోరినప్పటికీ వినకుండా భద్రతా సిబ్బందిపైకి కాల్పులు జరపడంతో, ఆత్మరక్షణ కోసమే తాము ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వాదించారు. ఈ కాల్పుల్లో తివారీ కాలికి గాయమవగా, చికిత్స నిమిత్తం పాట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించగా అక్కడ అతడు మరణించాడని పోలీసులు వెల్లడించారు.
వైరల్ వీడియోలతో వీడిన గుట్టు.. సస్పెన్షన్ వేటు
పోలీసులు దీనిని ఆత్మరక్షణ కోసం జరిగిన ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించినప్పటికీ, సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోలు పోలీసుల కథనాన్ని తలకిందులు చేశాయి. సదరు వీడియోలలో తివారీ కాల్పులకు ముందే తన వద్ద ఉన్న ఆయుధాన్ని దూరంగా పారేసినట్లు స్పష్టంగా కనిపిస్తుండటంతో, లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిని పోలీసులు ఎలా కాలుస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. పరిస్థితిని మరింత శాంతియుతంగా హ్యాండిల్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎన్‌కౌంటర్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణ సక్రమంగా నిర్వహించలేదనే కారణంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో సహా నలుగురు పోలీసులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
సొంత ప్రభుత్వంపైనే బీజేపీ నేతల నిప్పులు
ఈ ఎన్‌కౌంటర్ ఉదంతం బీహార్‌లోని అధికార కూటమిలో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ఈ ఘటనను తీరని విచారం, దురదృష్టకరం అని అభివర్ణిస్తూ, ఇందులో పరిపాలనాపరమైన నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. అమాయకులను బలితీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ నేతలు, మంత్రులైన మిథిలేష్ తివారీ, రీతురాజ్ సిన్హా, బక్సర్ ఎమ్మెల్యే ఆనంద్ మిశ్రాలు సైతం పోలీసుల తీరును తప్పుబట్టారు. ప్రాణాలు తీయకుండా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్ ఎందుకు చేశారని ప్రశ్నించిన రీతురాజ్ సిన్హా.. రక్షకులే భక్షకులుగా మారకూడదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సుప్రీం కోర్టుకు చేరిన వివాదం
భారత్ తివారీ మృతితో ఆగ్రహించిన బిలౌతీ గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తివారీ మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి అరా-బక్సర్ ఫోర్-లేన్ జాతీయ రహదారిని పూర్తిగా దిగ్బంధించి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇది పక్కా నకిలీ ఎన్‌కౌంటర్ అని, బాధ్యులైన పోలీసులపై హత్య కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రముఖ భోజ్‌పురి సింగర్ పవన్ సింగ్ కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ మరణం సమాజాన్ని కదిలించిందని, నిష్పాక్షిక విచారణ జరగాలని కోరారు. మరోవైపు ఈ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.
