Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం (Earthquake in Taiwan) ఒక్కసారిగా అలజడి సృష్టించింది. 25 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. తైవాన్‌లో వచ్చిన భూకంపం కారణంగా అటు జపాన్‌లోని యొనగుని ద్వీపంలో (Yonaguni Island) సునామీ (Tsunami in Japan)ముంచెత్తింది. 1999లో తైవాన్‌లోని నంటోవు కౌంటీలో 7.2 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఆ తరవాత ఇప్పుడే ఈ స్థాయిలో భూకంపం వచ్చింది. అప్పటి విపత్తులో 2,500 మంది మృతి చెందారు. దాదాపు 1,300 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడు తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం తక్కువగానే ఉండడం కాస్త ఊరటనిచ్చింది. ప్రస్తుతం వచ్చిన భూకంపం కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. Reuters న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం కనీసం 50 మంది గాయపడ్డారు. హువలిన్ ప్రాంతంలో ఈ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. భవనాలు ధ్వంసమయ్యాయి. తైవాన్ వ్యాప్తంగా రైల్ సర్వీస్‌లు నిలిచిపోయాయి. ఆఫీస్‌లు, స్కూళ్లు వెంటనే మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది.






ఇవాళ ఉదయం (ఏప్రిల్ 3) 8 గంటల ప్రాంతంలో ఈ భూప్రకంపనలు నమోదయ్యాయని US Geological Survey (USGS) వెల్లడించింది. హువలిన్‌లో భూకంప తీవ్రతకి ఓ ఐదంతస్తుల బిల్డింగ్‌లోని మొదటి అంతస్తు ధ్వంసమైంది. ఫలితంగా ఈ భవనం ఓ వైపు వంగి అలాగే నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ బిల్డింగ్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం కన్నా ముందు నిర్మించిన స్కూల్‌ కూడా ఈ భూకంపం వల్ల ధ్వంసమైనట్టు స్థానిక మీడియా తెలిపింది. కొన్ని కొండ చరియలు విరిగి పడ్డాయి. తైవాన్‌లో భూకంపం వచ్చిన తరవాత దాదాపు పావుగంట సేపు జపాన్‌లోని యొనగుని ద్వీపంలో సునామీ సంభవించింది. Japan Meteorological Agency  ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. 26 ఏళ్ల తరవాత జపాన్‌లోని ఒకినావా ప్రాంతానికి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సోషల్ మీడియాలో తైవాన్ భూకంపానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. భూకంపం సంభవించిన సమయంలో ఓ భారీ వంతెన ఊగిపోయింది. దానిపై ఉన్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.