Punjab Gun Culture:
పంజాబ్ ప్రభుత్వం ఆంక్షలు..
పంజాబ్‌లో గన్ కల్చర్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 813 గన్స్ లైసెన్స్‌లను రద్దు చేసింది. సీఎం భగవంత్ మాన్ గన్ కల్చర్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే లైసెన్స్‌లు రద్దు చేశారు. లుధియానా రూరల్‌లో 87, షాహీద్ భగత్ సింగ్ నగర్‌లో 48, గుర్‌దాస్‌పూర్‌లో 10, ఫరిద్‌కోట్‌లో 84, పఠాన్‌కోట్‌లో 199 గన్స్ లైసెన్స్‌లను రద్దు చేశారు. వీటితో పాటు హోషియా పూర్‌లో 47,కపుర్తలలో 6, SAS కస్బాలో 235, సంగ్రూర్‌లో 16 తుపాకుల అనుమతులను క్యాన్సిల్ చేశారు. అమృత్ సర్ కమిషనరేట్ పరిధిలోని 27 మంది తుపాకుల లైసెన్స్‌లను రద్దు చేసిన ప్రభుత్వం...జలంధర్ కమిషనరేట్ పరిధిలోనూ 11 మంది గన్ లైసెన్స్‌ల క్యాన్సిల్ చేసేశారు. ఇప్పటి వరకూ సుమారు 2 వేల తుపాకుల అనుమతులను రద్దు చేసింది భగవంత్ మాన్ సర్కార్. గన్స్ ఉంచుకోవాలి అనుకున్న వాళ్లు తప్పకుండా రూల్స్ పాటించాలి. పబ్లిక్ ఫంక్షన్లలో తుపాకులు పట్టుకుని తిరగడాన్ని నిషేధించింది. పెళ్లిళ్లలోనూ వీటిని వాడటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. హింసను ప్రేరేపించే విధంగా తుపాకులు పట్టుకుని వీడియోల్లో కనిపించినా కఠిన శిక్ష విధించనున్నారు. కొద్ది రోజుల పాటు అక్కడక్కడా తనిఖీలు కూడా చేపట్టనుంది ప్రభుత్వం. ప్రస్తుతానికి అధికారిక లెక్కల ప్రకారం పంజాబ్‌లో 3,73,053 ఆయుధ లైసెన్స్‌లు ఉన్నాయి.
రాష్ట్రంలో ఆయుధాల వినియోగింపై భగవంత్ మాన్ సర్కార్ కఠినంగా వ్యవహరించనుంది. ఈ మేరకు కొన్నిమార్గదర్శకాలు జారీ చేసింది. రోజూ రాష్ట్రంలో ఏదో ఓ చోట కాల్పుల ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అందుకే..ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఆయుధాలను పబ్లిక్‌గా డిస్‌ప్లే చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అంతే కాదు. గన్ లైసెన్స్ కూడా మునుపటిలా సులువుగా దొరకదు. ఇందుకు కూడా చాలా రూల్స్ పెట్టారు. అన్ని ప్రాంతాల్లోనూ సోదాలు, తనిఖీలు నిర్వహించనున్నారు. పంజాబీ సాంగ్స్‌లో కూడా ఎక్కడా ఆయుధాలు కనిపించకుండా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. డ్రగ్స్, ఆయుధాలు ఇకపై పంజాబీ సాంగ్స్‌లో కనిపించకూడదని ప్రభుత్వం హెచ్చరించింది.
ఇవే ఆ మార్గదర్శకాలు..
1. ఇప్పటికే లైసెన్స్‌లు పొందిన గన్స్‌ని వచ్చే మూడు నెలల్లో పూర్తి స్థాయిలో రివ్యూ చేయాలి. ఇకపై లైసెన్స్‌లు అంత సులువుగా జారీ చేయరు. అత్యవసర పరిస్థితులు అయితే తప్ప ఆయుధాలు క్యారీ చేయడానికి అనుమతినివ్వరు.
2. సోషల్ మీడియా సహా బహిరంగ ప్రదేశాల్లో ఆయుధాలను డిస్‌ప్లే చేయకూడదు. దీనిపై పూర్తి స్థాయి నిషేధం ఉంటుంది.
3. పలు ప్రాంతాల్లో అక్కడక్కడా తనిఖీలు చేపడతారు.
4. పాటల్లో హింసను, ఆయుధాల వినియోగాన్ని ప్రేరేపించే విధంగా చూపించటం నిషేధం. కచ్చితంగా ఈ నిబంధనను పాటించాల్సిందే.
5. ఏ వర్గం గురించైనా సరే అసభ్యకరమైన భాషలో మాట్లాడితే వెంటనే FIR నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారు.
6. నిర్లక్ష్యంగా ఆయుధాలను వినియోగించడం, వాటిని సెలెబ్రెటీ హోదా కోసం అనవసరంగా కాల్చడం, ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించటం లాంటివి చేస్తే FIR నమోదు చేస్తారు. కఠినంగా శిక్షిస్తారు.
Also Read: రాహుల్‌ను దేశం నుంచి తరిమేయాలి,ఆయన ఎప్పటికీ దేశ భక్తుడు కాలేడు - బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్