అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో విమర్శించారు. బైడెన్‌కు మతి భ్రమించిందని, ఆయన తన చర్యలతో దేశాన్ని మూడో ప్రపంచ యుద్ధం దిశగా తీసుకెళ్తున్నాడంటూ మండిపడ్డారు. మూగ వాడని, అసమర్థుడని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దేశ రక్షణ విషయంలో అతడి ప్రవర్తన బాలేదని, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ట్రంప్‌ విమర్శించారు. 


దేశానికి రక్షణగా ఉండే సరిహద్దుల విషయంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల దేశం ప్రమాదంలో పడే అవకాశాలున్నాయన్నారు.దేశ రక్షణకు సరిహద్దు గోడలు లేకపోవడం, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌, ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అంశంలోనూ, ఆయుధాల సమీకరణలోనూ బైడెన్‌ విధానాలు దేశానికి హాని చేసేవిగా ఉన్నాయని ట్రంప్ విమర్శలు గుప్పించారు. సరిహద్దులు ఓపెన్‌గా ఉండడం, వెపనైజ్‌డ్‌ పాలసీలు చూస్తుంటే బైడెన్‌కు పూర్తిగా మతిభ్రమించిందని అనిపిస్తుందని ట్రంప్‌  అన్నారు. మరే ఇతర కారణం కాదు కేవలం ఈ వ్యక్తి వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందని అన్నారు. 


డొనాల్డ్‌ ట్రంప్‌ 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు. కాగా ఆయనను పలు కేసులు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. గత అధ్యక్ష ఎన్నికల సమయంలో ఫలితాలను తారమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో ట్రంప్‌ పలు కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల జార్జియాలోని పుల్టన్‌ కౌంటీలో కొన్ని నిమిషాల పాటు జైలుకు కూడా వెళ్లి శిక్ష అనుభవించాల్సి వచ్చింది. పోలీసుల రికార్డుల కోసం ట్రంప్‌ను మగ్‌షాట్‌ (ఫొటో) కూడా తీశారు. ఆ తర్వాత విడుదలయ్యారు. కానీ అమెరికా చరిత్రలోనే మగ్‌షాట్‌ తీయించుకున్న తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్‌ నిలిచారు. ట్రంప్‌ మగ్‌షాట్‌పై బైడెన్‌ వ్యంగ్యంగా స్పందించారు. టెలివిజన్‌లో ఫొటో చూశాను, హ్యాండ్‌సమ్‌ గా ఉన్నారంటూ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.


ఇరువురు నేతల సమయం దొరికినప్పుడల్లా పరస్పర విమర్శలు చేసుకుంటేనే ఉన్నారు. ట్రంప్‌ ఇటీవల ఫ్యాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి అమెరికా దళాలు ఉపసంహరించుకోవడం గురించి ప్రస్తావించారు. అక్కడి నుంచి వైదొలగడం గొప్ప విషయమే కానీ ఇలా ఉపసంహరణను బైడెన్‌ కంటే  దారుణంగా ఎవ్వరూ హ్యాండిల్‌ చేయలేరని విమర్శించారు. ఇది చరిత్రలోనే అతి పెద్ద ఇబ్బందికరమైన ఘటన అని అన్నారు.