Bharat Taxi cooperative model app: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న భారత్ టాక్సీ సహకార నమూనాలో నడుస్తుంది. ప్రైవేట్ క్యాబ్ దిగ్గజాలు ఓలా, ఉబర్‌లకు గట్టి పోటీనిస్తూ.. డ్రైవర్ల సంక్షేమమే పరమావధిగా ఈ సరికొత్త వ్యవస్థ పని చేయనుంది.
భారత్ టాక్సీ: డ్రైవర్లే యజమానులు - లాభమే లక్ష్యం కాదు! అమూల్ సంస్థలో పాడి రైతులు ఎలాగైతే వాటాదారులుగా ఉండి లాభాలను పంచుకుంటారో 'భారత్ టాక్సీ'లో క్యాబ్ డ్రైవర్లు కూడా కేవలం పని చేసే వారు మాత్రమే కాదు, ఆ సంస్థలో వాటాదారులుగా ఉంటారు. 'సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్' ఆధ్వర్యంలో నడిచే ఈ ప్లాట్‌ఫారమ్, లాభాపేక్ష లేని ప్రైవేట్ సంస్థగా కాకుండా, వేలాది మంది డ్రైవర్లు కలిసి నడిపే ఒక సహకార సంఘంగా పని చేస్తుంది. వీరికి 'సారథులు' అని పేరు పెట్టారు.
2. జీరో కమిషన్ - డ్రైవర్లకు పూర్తి ఆదాయం ప్రస్తుతం ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ సంస్థలు ఒక్కో రైడ్‌పై డ్రైవర్ల నుండి 20% నుండి 30% వరకు కమిషన్ వసూలు చేస్తున్నాయి. కానీ, భారత్ టాక్సీ జీరో కమిషన్ మోడల్‌ను అనుసరిస్తుంది. అంటే, ప్రయాణీకుడు చెల్లించే మొత్తం నేరుగా డ్రైవర్‌కే చెందుతుంది. ఈ వ్యవస్థ నడవడానికి డ్రైవర్లు కేవలం స్వల్ప మొత్తంలో నెలవారీ లేదా రోజువారీ మెంబర్‌షిప్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
3. వినియోగదారులకు సర్జ్ ప్రైసింగ్ భయం లేదు కస్టమర్లకు ఈ భారత్ టాక్సీ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం నో సర్జ్ ప్రైసింగ్ . సాధారణంగా వర్షం పడినప్పుడు లేదా రద్దీ సమయాల్లో ప్రైవేట్ యాప్‌లు ధరలను రెట్టింపు చేస్తాయి. కానీ భారత్ టాక్సీలో ధరలు పారదర్శకంగా, ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం స్థిరంగా ఉంటాయి. దీనివల్ల సామాన్య ప్రయాణీకులపై అదనపు భారం పడదు.
4. డిజిటల్ అనుసంధానం ఈ ప్రాజెక్టు వెనుక అమూల్, ఇఫ్కో (IFFCO), నాబార్డ్ (NABARD) వంటి దిగ్గజ సహకార సంస్థల మద్దతు ఉంది. ఇది ప్రభుత్వ 'డిజిటల్ ఇండియా' విజన్‌కు అనుగుణంగా డిజిలాకర్, ఉమాంగ్ (UMANG) వంటి ప్రభుత్వ యాప్‌లతో అనుసంధానించి ఉంటుంది. ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ సేవలు జనవరి 1, 2026 నుండి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. 2030 నాటికి దేశవ్యాప్తంగా లక్ష మంది డ్రైవర్లను చేర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రయాణీకుల భద్రత కోసం ఈ యాప్‌లో రియల్ టైమ్ జీపీఎస్ ట్రాకింగ్, డ్రైవర్ల వెరిఫికేషన్ మరియు స్థానిక పోలీసులతో అనుసంధానం వంటి ఫీచర్లు ఉన్నాయి. మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ ద్వారా సామాన్యులు కూడా ఈజీగా ఈ సేవలను వినియోగించుకోవచ్చు.