Second Hand Premium Hatchback: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో, Maruti Suzuki Baleno ఫ్లాట్‌ఫామ్‌పై టయోటా బ్యాడ్జ్‌తో వచ్చిన మోడల్ Toyota Glanza. స్పేస్, మైలేజ్, ఫీచర్లు అన్నింటిలోనూ ఇది బాలెనో స్థాయిలోనే ఉంటుంది. అదనంగా, టయోటా బ్రాండ్ నమ్మకం, ఎక్కువ వారంటీ లభించడం వల్ల యూజ్డ్ మార్కెట్‌లో Glanza మంచి డిమాండ్‌ను సంపాదించుకుంది.
సెకండ్ జనరేషన్ Toyota Glanzaను 2022 మార్చిలో మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఈసారి బాలెనోతో పోలిస్తే డిజైన్‌లో కూడా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. క్యామ్రీ తరహాలో ఉండే గ్రిల్, షార్ప్‌గా కనిపించే ఫ్రంట్ బంపర్, కొత్త అలాయ్ వీల్స్, సింపుల్ LED గ్రాఫిక్స్ ఉన్న హెడ్‌ల్యాంప్స్ ఈ కారుకు ప్రత్యేక గుర్తింపు ఇస్తాయి. ఇంటీరియర్‌లో బ్లాక్, బేజ్ డ్యుయల్ టోన్ అప్హోల్స్టరీ ఉండటం వల్ల కుటుంబ వినియోగానికి ఇది మరింత అనుకూలంగా మారింది.
ఇంజిన్ ఆప్షన్లు
Toyota Glanzaలో 1.2 లీటర్, నాలుగు సిలిండర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90hp శక్తి, 113Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజిన్‌కు 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు లభిస్తాయి. టయోటా ఇందులో CNG వేరియంట్ కూడా తీసుకొచ్చింది. ఇందులో అదే ఇంజిన్ 77hp శక్తి, 98.5Nm టార్క్‌తో పనిచేస్తుంది. CNG వేరియంట్ మాన్యువల్‌లో మాత్రమే వస్తుంది.
మైలేజ్
పెట్రోల్ మాన్యువల్ – 22.35 kmplAMT – 22.94 kmplCNG – 30.61 km/kg (ARAI)
రోజూ ఎక్కువ దూరం ప్రయాణం ఉంటే CNG మంచి ఎంపిక. అయితే బూట్ స్పేస్ కొంత తగ్గుతుంది. సౌకర్యం కావాలంటే పెట్రోల్ AMT సరైన ఆప్షన్‌గా నిలుస్తుంది.
వేరియంట్లు, ఫీచర్లు
Toyota Glanza మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది, అవి – E, S, G, V. టాప్ వేరియంట్ Glanza Vలో హెడ్ అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, 9 ఇంచ్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ Android Auto, Apple CarPlay, క్రూయిజ్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆటో క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మీ బడ్జెట్ అనుమతిస్తే V వేరియంట్‌నే ఎంచుకోవడం మంచిది. G వేరియంట్‌లో కూడా అవసరమైన అన్ని ఫీచర్లు దాదాపుగా లభిస్తాయి. S వేరియంట్ బేసిక్ అవసరాలకు సరిపోతుంది.
టయోటా వారంటీ ఎందుకు ప్లస్ పాయింట్?
Toyota Glanzaకి స్టాండర్డ్‌గా 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్లు వారంటీ వస్తుంది. దీనిని 5 సంవత్సరాలు లేదా 2.2 లక్షల కిలోమీటర్ల వరకు పెంచుకోవచ్చు. యూజ్డ్ కార్ కొన్నా కూడా చాలాసార్లు వారంటీ మిగిలే ఉంటుంది. ఇదే బాలెనోతో పోలిస్తే Glanzaకి పెద్ద ప్లస్.
ప్రి-ఓన్డ్ Glanza కొనేముందు ఇవి చెక్ చేయండి
AMT గేర్‌బాక్స్: టెస్ట్ డ్రైవ్‌లో గేర్ మార్పులు షార్ప్‌గా, జర్క్ లేకుండా జరుగుతున్నాయా గమనించాలి.
టచ్‌స్క్రీన్ సమస్యలు: స్క్రీన్ ల్యాగ్, ఫ్రీజ్ అవుతుందా లేదా చూసుకోవాలి.
రీకాల్ చెకింగ్: 2022 డిసెంబర్, 2023 జనవరి మధ్య తయారైన కార్లలో ఎయిర్‌బ్యాగ్ యూనిట్ రీకాల్ జరిగింది. అది పూర్తయ్యిందో, లేదో నిర్ధారించాలి.
సెకండ్ హ్యాండ్ ధర ఎంత?
యూజ్డ్ Toyota Glanza ధరలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సాధారణంగా మంచి కండిషన్‌లో ఉన్న కార్లు రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఉంటాయి. రూ.8 లక్షలకు మించి వెళ్తే కొత్త కారు కొనడం మంచి నిర్ణయం అవుతుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.