Temperature in Bengaluru: ఇప్పటికే నీళ్లు లేక అల్లాడిపోతున్న బెంగళూరు వాసులను ఎండలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. మునుపెన్నడూ లేని స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 8 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఇటీవల 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంగా బెంగళూరు అంటే చాలా చల్లగా ఉంటుందని అనుకుంటారు. కానీ...ఇప్పుడు అక్కడ కూడా ఎండలు మండిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో సగటు ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలుగా ఉంటున్నాయి. ఏప్రిల్‌లో సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతలతో పోల్చి చూస్తే...ఇప్పుడు కనీసం 3 డిగ్రీలు ఎక్కువగానే ఉంటోంది. ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం వల్ల సిటీలో వర్షపాతం క్రమంగా తగ్గుతోందని అక్కడి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో కారణంగా ఈ మార్పులు కనిపిస్తున్నాయని వెల్లడించారు.


అటు పట్టణీకరణ కూడా విపరీతంగా కొనసాగుతుండడం వల్ల బెంగళూరులో వర్షాలు పడడం తగ్గిపోయిందని అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ వేడిని బెంగళూరు వాసులు తట్టుకోలేకపోతున్నారు. గతంలో ఉదయం, సాయంత్రం వాకింగ్‌కి వెళ్లే వాళ్లు వేడి గాలుల్ని తట్టుకోలే ఇంటిపట్టునే ఉంటున్నారు. గతంలో సిటీలో ఎప్పుడూ ఇలాంటి వాతావరణం లేదని అంటున్నారు స్థానికులు. ఓ వైపు నీళ్లు లేక అవస్థలు పడుతుంటే..మరో వైపు ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా దాహం ఆరక నరకం చూడాల్సి వస్తోంది.


దాదాపు రెండు నెలలుగా బెంగళూరులో నీటి సంక్షోభం కొనసాగుతోంది. చుక్క నీటి కోసం అవస్థలు పడుతున్నారు. ట్యాంకర్‌లు తెప్పించుకుని రోజువారీ అవసరాలు తీర్చుకుంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఇప్పట్లో వర్షాలు పడే అవకాశమూ కనిపించడం లేదని అక్కడి వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. మరి కొద్ది రోజుల పాటు ఇలా నీటి ఎద్దడిని ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తోంది. ఈ సంక్షోభంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే ఈ కొరత వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరవాత పలు నీటి పారుదల ప్రాజెక్ట్‌లు ఆగిపోయాయని ఆరోపించారు. శాంతి భద్రతలు అదుపు తప్పాయని మండి పడ్డారు. 


"నీళ్లు లేకపోవడం మాత్రమే సమస్యే కాదు. కొన్ని చోట్ల కలరా వ్యాధి ప్రబలుతోందని తెలుస్తోంది. ఇది మరింత ఆందోళనకరమైన విషయం. చాలా మందికి సరిపడా నీళ్లు అందుబాటులో ఉండడం లేదు. కొన్ని ఇళ్లలో కలుషిత నీళ్లు సరఫరా అవుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వాటినే తాగుతున్నారు. ఫలితంగా వాళ్లంతా కలరా బారిన పడుతున్నారు"


- నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి


బెంగళూరులో నీటి కొరత మొదలైనప్పటి నుంచి వరుసగా కలరా కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడో నెలకు ఒక కేసు నమోదు కాగా..ఇప్పుడు కనీసం ఐదారుగురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం, నీళ్లు రావడమే ఎక్కువ అనుకుని వాడుకోవడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు అవస్థ పడుతున్నారు. నీళ్లు లేక చాలా మంది మాల్స్‌లోకి వెళ్లి అక్కడే స్నానాలు చేస్తున్నారు. మరికొందరు ఆఫీస్‌లకు వెళ్లడం మానేశారు. ఇళ్లలో నుంచే పని చేసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.