Bengaluru Water Crisis News: బెంగళూరులో నీటి కొరత రానురాను తీవ్రతరమవుతోంది. ఒక్కొక్క చుక్కనీ లెక్కగట్టి మరీ వాడుకుంటున్నారు. ఇప్పటికే వెల్ఫేర్ అసోసియేషన్స్ చాలా కఠినమైన నిబంధనలు విధిస్తున్నాయి. ఒక్క చుక్కనీటిని కూడా వృథా చేయొద్దని తేల్చి చెబుతున్నాయి. అటు సోషల్ మీడియాలోనూ ఈ నీటి సంక్షోభంపై వరుస పెట్టి పోస్ట్‌లు పెడుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు మరోసారి వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక్కడ నీటి కోసం చాలా కష్టాలు పడాల్సి వస్తోందని..సొంతూళ్లకి వెళ్లిపోయి అక్కడి నుంచి పని చేసుకుంటామని చెబుతున్నారు. ప్రభుత్వమే వర్క్ ఫ్రమ్ హోమ్‌ని అధికారికంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిటీ అంతటా ఈ నిబంధనని అమలు చేయాలని అడుగుతున్నారు. చాలా మంది ఉద్యోగులు X వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యుటీ సీఎం డీకే శివకుమార్‌ అకౌంట్స్‌ని ఈ పోస్ట్‌లకు ట్యాగ్ చేస్తున్నారు. బెంగళూరు వెదర్ మ్యాన్ కూడా ఈ సంక్షోభంపై స్పందించారు. దాదాపు నెల రోజుల పాటు వర్షం కురిసే అవకాశమే లేదని తేల్చి చెప్పాడు. ఫలితంగా...ఈ కొరత మరింత తీవ్రతరమవుతుందని ఆందోళన చెందుతున్నారు. అందుకే 90 రోజుల పాటు ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటు కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. 


 






"ఇప్పటికే వేసవి మొదలైంది. బెంగళూరులో అప్పుడే నీటి సంక్షోభం తీవ్రతరమైంది. మరో నెల రోజుల పాటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలే కనిపించడం లేదు. అందుకే కర్ణాటక ప్రభుత్వం ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం మంచిది. వర్షాకాలం మొదలయ్యేంత వరకూ ఇదే ఆప్షన్‌ని కొనసాగించాలి"


- బెంగళూరు వెదర్ మ్యాన్






బెంగళూరులో ఉన్న 20-30% మంది ఐటీ ఉద్యోగులు సొంతూళ్లకి వెళ్లిపోయినా సిటీలో రోజువారీ నీటి వినియోగం భారీగా తగ్గిపోతుందని చెబుతున్నారు. పైగా ఇక్కడ అద్దెలు కట్టడంతో పాటు వాటర్ ట్యాంకర్‌ల కోసం చేసే ఖర్చు తడిసి మోపెడవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ బాధలు పడే బదులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తే ఊరికి వెళ్లిపోయి పని చేసుకుంటామని పోస్ట్‌లు పెడుతున్నారు ఐటీ ఉద్యోగులు. అయితే...ఇది ఓ ఆప్షన్‌లాగా ఇవ్వాలని, నచ్చిన వాళ్లు ఆఫీస్‌లకి వెళ్తారని, ఇబ్బందులు పడే వాళ్లు ఇళ్లకి వెళ్లిపోతారని చెబుతున్నారు. వానలు పడే వరకూ ఈ కష్టాలు తప్పేలా లేవని అందుకే తమ విజ్ఞప్తిని పరిశీలించాలని కోరుతున్నారు.