Ellyse Perry powers RCB into playoffs: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL)లో రాయల్‌ ఛాలెంజర్‌ బెంగళూరు(RCB) ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో ముంబైపై ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్‌లో అడుగు పెట్టింది. తొలుత ముంబైని 113 పరుగులకే కట్టడి చేసిన బెంగళూరు... తర్వాత 15 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సునాయస విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లో ఘనంగా అడుగుపెట్టింది.


మ్యాచ్‌ సాగిందిలా...
ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 113 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆర్సీబీ బౌలర్‌ ఫెర్రీ విజృంభణతో ముంబై బ్యాటర్లకు కష్టాలు తప్పలేదు. ఆరు వికెట్లు నేలకూల్చిన ఫెర్రీ ముంబై పతనాన్ని శాసించింది. ఓపెనర్లు సజన(30), హెలీ మ్యాథ్యూస్‌(26) పరుగులతో ముంబైకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 65 పరుగుల వద్ద రెండే వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించిన ముంబై.. ఆ తర్వాత ఫెర్రీ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. బెంగళూరు బౌలర్లలో పెర్రీ ఆరు వికెట్లు పడగొట్టగా, సోఫీ మోలినిక్స్‌, సోఫీ డివైన్‌, ఆశ, శ్రేయాంక ఒక్కో వికెట్‌ తీశారు. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ... సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్‌లో ఆరు వికెట్లు తీసిన ఫెర్రీ.. బ్యాటింగ్‌లోనూ రాణించింది. బెంగళూరు 39 పరుగులకే మూడు వికెట్లు పడ్డప్పటికీ ఎలిస్‌ పెర్రీ 38 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సుతో 40 పరుగులు... రిచా ఘోష్‌ (28 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సులతో 36 పరుగులు చేసి మరో వికెట్‌ పడకుండా ఆర్సీబీకి విజయం అందించారు. ముంబై బౌలర్లలో షబ్నిమ్‌ ఇస్మాయిల్‌, హేలీ మ్యాథ్యూస్‌, నాట్‌సీవర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌తో ముంబై, ఆర్సీబీ జట్లు తమ లీగ్‌ మ్యాచ్‌లను ముగించాయి. ఇక ఇప్పటికే ముంబై ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ దాదాపు ఫైనల్‌కు చేరినట్లే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించడంతో మరో రెండు జట్లు యూపీ వారియర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ ఇంటిబాట పట్టాయి. ఢిలీ, గుజరాత్‌ మధ్య మరో నామమాత్రమైన పోరు మిగిలి ఉంది.


ముగిసిన యూపీ కథ
వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL 2024)లో మరో ఉత్కంఠభరిత పోరు.. అభిమానులను అలరించింది.ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌( UP Warriorz)  పరాజయం పాలైంది. గుజరాత్‌(Gujarat Giants)తో జరిగిన కీలక పోరులో యూపీ వారియర్స్‌ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్‌ చేసి గుజరాత్‌ జెయింట్స్‌ నిర్దేశించిన 153 పరుగుల ఛేదనలో యూపీ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 144 పరుగుల వద్దే ఆగిపోయింది . మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు బెత్‌ మూనీ 52 బంతుల్లో 10 ఫోర్లు, 1 భారీ సిక్సర్‌తో 74 పరుగులు చేసింది. లారా వోల్వార్ట్‌ 30 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సుతో 43 పరుగులతో ధాటిగా ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించి గుజరాత్‌కు మంచి శుభారంభం అందించారు. యూపీ వారియర్స్‌ బౌలర్లలో ఎక్లెస్టోన్‌ మూడు వికెట్లు తీయగా, దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది.