Techie Couple: ప్రేమ గుడ్డిదంటారు. ప్రేమలో పడితే ప్రేమికులు కూడా గుడ్డిగానే ఉంటారు. ఎవరూ చూడట్లేదని అన్ని పనులు బహిరంగంగానే చేసుకుంటూ ఉంటారు. అవన్నీ హద్దుల్లో ఉంటే.. చూసిన వాళ్లు కొత్త ప్రేమికులు.. అలాగే ఉంటుందని వదిలేస్తారు. కానీ హద్దు మీరితే మాత్రం సమాజం అంగీకరించదు. అలాంటిదే ఓ ఘటన బెంగళూరులో జరిగింది.
బెంగళూరులోని సర్జాపూర్ హైవేపై ఇటీవల ఓ జంట వీడియో వైరల్ అయింది. తమను తాము అర్జున్ రెడ్డి సినిమా తరహా లవర్స్ లాగా ఫీలయ్యారు. యువకుడు బైక్ రైడింగ్ చేస్తూండగా ఆ లవర్ వెనుక కూర్చోకుండా పెట్రోల్ ట్యాంక్ పై కూర్చుని రివర్స్ లో తిరిగి అతన్ని హగ్ చేసుకుని కూర్చుంది. అదో అసభ్యమైన భంగిమలా ఉంటుంది. అలాగే వారు రైడ్ చేసుకుంటూ పోయారు. కొంత మంది ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బెంగళూరులో ఇలాంటి అతి లవర్స్ ఎక్కువైపోయారని పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసుల దృష్టికి ఈ వీడియో వెళ్లడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. బైక్ నెంబర్ ఆధారంగా ఎవరు ఆ పని చేశారో గుర్తించారు. వెంటనే పోలీస్ కేసు పెట్టారు. తమిలనాడు రిజిస్ట్రేషన్ తో ఉన్న వాహనంపై ప్రయాణించిన వారు ఎవరో ఆరా తీసి.. అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఊరుకునేది లేదని కేసులు పెట్టి లోపలేస్తామని పోలీసులు ప్రకటించారు. ఇలాంటి ప్రమాదక బైక్ రైడింగ్ చేసిన వారు ఇద్దరూ ఐటీ ఉద్యోగులేనని గుర్తించారు.
ఇటీవలి కాలంలో కొంత మంది యువకులు, యువతులు.. తాము ప్రేమలో ఉన్నామని ఒకరినొకరు విడిచి ఉండలేమని అనుకుంటున్నారు. అలా అనుకోవచ్చు కానీ సినిమాలు చూసి విపరీత ప్రవర్తనకు పోతూండటంతో సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి వారి వల్ల ప్రమాదాలు ఎక్కవగా జరిగే అవకాశం ఉండటంతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీసులు వేగంగా స్పందించడంపై పలువురు నెటిజన్లు సంతృప్తి వ్యక్తం చేశారు. భారీ ఫైన్లు వేయడం ద్వారా మరోసారి అలాంటి పనులు చేయకుండా చూడాలన్నారు.