Anti suicide fan devices in medical hostels: చదువుల ఒత్తిడిని భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థుల్ని ఆత్మహత్య ఆలోచనల నుంచి మళ్లించడానిి చర్యలు తీసుకుంటూనే  కర్ణాటకలోని వైద్య కళాశాలలు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాయి.  కర్ణాటకలో మెడికల్ కాలేజీలను పర్యవేక్షించే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (RGUHS) తమ పరిధిలోని అన్ని వైద్య కళాశాలల హాస్టళ్ల సీలింగ్ ఫ్యాన్‌లలో యాంటీ-సూసైడ్ డివైస్‌లను అమర్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మండ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (MIMS)లో రెండు వారాల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు హాస్టల్ గదులలో ఆత్మహత్య చేసుకున్న ఘటనల తర్వాతతీసుకున్నారు. 

జూలై 30, 2025న, కొప్పల్ జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి భరత్ తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 2, 2025న, అదే సంస్థలో చివరి సంవత్సరం బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని నిష్కల కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు ఘటనలు వైద్య కళాశాలలలో విద్యార్థుల మానసిక ఒత్తిడి , ఆత్మహత్య ధోరణులపై చర్చకు కారణం అయ్యాయి.   కర్ణాటకలో వైద్య విద్యార్థులపై అధిక  ఒత్తిడి, ర్యాగింగ్, ఎక్కువ పనిగంటలు వంటి వాటి కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

ఈ డివైస్‌లను సీలింగ్ ఫ్యాన్‌లకు అమరుస్తారు.  20 కిలోల కంటే ఎక్కువ బరువు వేలాడినప్పుడు ఫ్యాన్ డిటాచ్ అవుతుంది. ఈ సమయంలో ఒక సైరన్ మోగుతుంది.  ఇది హాస్టల్ అధికారులు ,  సిబ్బందిని వెంటనే హెచ్చరిస్తుంది. ఈ విధానం విద్యార్థులను సకాలంలో రక్షించడానికి , మానసిక సహాయం అందించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.  మండ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (MIMS)లో ఈ డివైస్‌ల పైలట్ టెస్టింగ్ ఇప్పటికే నిర్వహించారు.  ఈ పరీక్షలు విజయవంతంగా అవడంతో  అన్ని అనుబంధ కళాశాలలకు ఈ డివైస్‌లను  పంపించాలని నిర్ణయించారు.  ఐఐటీ ఖరగ్ పూర్‌లో కూడా వినియోగిస్తున్నారు. 

ఈ డివైస్‌లను బెంగళూరుకు చెందిన ఒక సంస్థ అభివృద్ధి చేసింది. వీటిని ఇప్పటికే విద్యార్థుల ఆత్మహత్యల కేంద్రంగా మారిన రాజస్థాన్ లోని కోటాలోని హాస్టళ్లలో కూడా పరీక్షించారు. యాంటీ-సూసైడ్ డివైస్‌ల అమరికతో పాటు, RGUHS విద్యార్థులకు మానసిక ఆరోగ్య సహాయం అందించేందుకు కౌన్సెలింగ్ సేవలను బలోపేతం చేయాలని యోచిస్తోంది. విద్యార్థులలో మానసిక ఒత్తిడి లేదా నీరసం లక్షణాలు కనిపిస్తే, వారికి సకాలంలో కౌన్సెలింగ్ , తల్లిదండ్రులకు సమాచారం అందించే విధానాలను అమలు చేయనున్నారు. యాంటీ-సూసైడ్ డివైస్‌లు ఆత్మహత్య ప్రయత్నాలను తాత్కాలికంగా నిరోధించవచ్చు కానీ  విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించలేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.