రికార్డు స్థాయిలో చలానాలు..


సిటీల్లో ట్రాఫిక్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆఫీస్‌ వేళల్లో అయితే నిత్యం నరకం చూడక తప్పదు. ఎన్ని రోడ్లు, ఫ్లైఓవర్లు కడుతున్నా రద్దీ మాత్రం తగ్గటం లేదు. ఆఫీస్‌ హడావుడిలోనో, చిరాకులోనే కొందరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే..మరి కొందరు కావాలనే రూల్స్ బ్రేక్ చేస్తూ వెళ్లిపోతుంటారు. కారణమేదైనా వారికి భారీ చలానాలు విధిస్తారు ట్రాఫిక్ పోలీసులు. నగరాల్లో ఈ చలానాల ద్వారా రాష్ట్ర ఖజానాకు బానే ఆదాయం సమకూరుతోంది. ఈ చలానాల విషయంలో కొందరు ట్రాఫిక్ పోలీసులకు టార్గెట్‌లు కూడా పెడుతున్నారు. ఇలా టార్గెట్ రీచ్ అవ్వాలనుకున్నాడో ఏమో, బెంగళూరులోని ఓ ట్రాఫిక్ పోలీస్ రికార్డ్ స్థాయిలో చలానాలు విధించి రూ. 2 లక్షలు వసూలు చేశాడు. కామాక్షిపల్యా ట్రాఫిక్ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ శివన్న ఈ రికార్డు సాధించారు. జనభారతి జంక్షన్ వద్ద ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకువిధులు నిర్వర్తించారు శివన్న. ఈ ఆరు గంటల సమయంలోనే ఈ స్థాయిలో చలానాలు విధించారు. 


ఇది ఎంతో అరుదైన రికార్డ్‌-ఎస్ఐ శివన్న


ఇదో అరుదైన రికార్డ్ అంటూ కామాక్షిపల్య ట్రాఫిక్ పోలీస్ విభాగం ఎస్‌ఐ ఫోటోని ట్వీట్‌ చేసింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 249 మందికి చలానాలు విధించినట్టు వెల్లడించింది. ఇందులో అత్యధికంగా ఓ వ్యక్తి రూ. 36,000 కట్టాడు. దాదాపు ఆర్నెల్లుగా తన కార్‌ని 36 సార్లు నో పార్కింగ్ ప్లేస్‌లో ఉంచుతూ నిబంధనలు ఉల్లంఘించాడు కార్‌ ఓనర్. అందుకే ఆ వ్యక్తి ఈ స్థాయిలో ఫైన్ కట్టాల్సి వచ్చింది. కామాక్షిపల్యా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంత పెద్ద మొత్తం వసూలు కావటం ఇదే తొలిసారి అని చాలా గర్వంగా చెబుతున్నాడు ఎస్‌ఐ శివన్న. 


ఎస్‌ఐతో పాటు ఆయన టీమ్‌ని జనభారతి జంక్షన్‌లో ట్రాఫిక్‌ పర్యవేక్షించేందుకు నియమించారు ఉన్నతాధికారులు. టూవీలర్, ఫోర్ వీలర్స్‌ని ఎక్కువగా చెక్‌ చేసింది ఎస్‌ఐ శివన్న బృందం. సిగ్నల్ జంపింగ్, రాంగ్ పార్కింగ్, హెల్మెట్ లేకుండా నడపటం లాంటివి ఈ ఉల్లంఘనల జాబితాలో ఉన్నాయి. వీరిలో 15 మంది టూ వీలర్స్‌పై కేస్‌లు కూడా బుక్ చేశారు. ఆరుగంటల్లో ఇంత భారీ మొత్తంలో డబ్బు వసూలు చేయటం తన కెరీర్‌లో ఇదే తొలిసారి అని చెప్పారు ఎస్ఐ శివన్న. ఆ మధ్య హైదరాబాద్‌లోనూ ఓ టూవీలర్ యజమానిపై ఉన్న చలానాలు చూసి ట్రాఫిక్ పోలీసులే కంగు తిన్నారు. చలానాల జాబితా చేంతాడంత ఉందని, ప్రింట్ తీసే కొద్దీ చలానాలు వస్తూనే ఉన్నాయని అప్పట్లో సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.