Karnataka Politics : నాలుగు రాజ్యసభ స్థానాలకు కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఆరు మంది పోటీలో నిలబడ్డారు. ఎవరికి వారు ఓట్లు వేసుకుంటే అసలు పోటీ ఉండేది కాదు. ఏకగ్రీవం అయ్యేది. కానీ ఒకరి ఓట్లపై మరొకరు ఆశలు పెట్టుకుని... అభ్యర్థుల్ని నిలబెట్టారు. అనుకున్నట్లుగానే పోలింగ్ జరిగింది. ఎవరి ఓట్లు వారు వేసుకుంటే సమస్య ఉండేది కాదు. కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ... తమ పార్టీకి కాకుండా ఇతర పార్టీకి ఓటు వేశారు. వారిద్దరూ జేడీఎస్‌కు చెందిన వారు. కానీ వారు ఓటు వేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత మీడియా చుట్టు ముట్టింది. సొంత పార్టీకి కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఎలా ..ఎందుకు ఓటు వేశారని ప్రశ్నించింది. దానికి వారు చెప్పిన సమాధానం ఇది. 


 





 
కాంగ్రెస్ పార్టీని లవ్ చేస్తున్నారట. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారట. అంటే ఇంత కాలం కాంగ్రెస్ పార్టీని ప్రేమిస్తూ జేడీఎస్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. 



నాలుగు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో రెండు బీజేపీకి , ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఖాయంగా వస్తాయి. మరో రాజ్యసభ స్థానం గెల్చుకోవాలంటే 45 ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. ఇద్దరు రాజ్యసభ సభ్యుల్ని గెలిపించుకున్నతర్వాత బీజేపీకి 32 ఓట్లు ఉంటాయి. జేడీఎస్‌కు 32 ఉంటాయి. కాంగ్రెస్‌కు అందరి కంటే తక్కువగా 24 ఓట్లు ఉంటాయి. ఎలా చూసినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే చాన్స్ లేదు. సమాన ఓట్లు ఉన్న బీజేపీ , జేడీఎస్‌లలో ఎవరో ఒకరు గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు జేడీఎస్ ఓట్లను కాంగ్రెస్ చీల్చడం వల్ల బీజేపీ అభ్యర్థికి మేలు జరగనుంది. 


అందుకే జేడీఎస్ నేత కుమారస్వామి కాంగ్రెస్ పై మండిపడ్డారు. బీజేపీని బలపరుస్తున్నారని విమర్శించారు. పార్టీని ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు తాము ప్రేమిస్తున్నట్లుగా చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమే.