Bangladeshi Students Party: షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఆమె పారిపోయేలా చేసిన విద్యార్థులు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్న నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ పైనా అంత సంతృప్తిగా లేరు. ఆయన భారత్ విషయంలో వ్యతిరేకంగా ఉండటమే కాకుండా.. పాకిస్తాన్ కు దగ్గర అవుతున్నారు. ఆ దేశంలో వ్యాపార సంబంధాలు పెంచుకుంటున్నారు. దీంతో విద్యార్థి నేతల్లో అసంతృప్తి ప్రారంభమయింది. కొద్ది రోజులు వేచి చూసిన వారు ఇక ఆగలేక ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశారు. కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు.

డెమోక్రటిక్ స్టూడెంట్ కౌన్సిల్ పేరుతో పార్టీ               

గణతాంత్రిక్ ఛత్ర సంసద్ ( డెమోక్రటిక్ స్టూడెంట్ కౌన్సిల్) పేరుతో  షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.  అయితే కొత్త పార్టీ విషయంలో విద్యార్థుల మధ్య కూడా అనేక వివాదాలు ఉన్నాయి. పార్టీ ప్రకటన సమయంలో అనేక మంది ఘర్షణలకు దిగారు. తమకు ప్రాతినిద్యం సరిగ్గా ఇవ్వడం లేదని కొంత మంది ాదడులకు దిగారు.  హసీనా భారతదేశానికి పారిపోయిన తర్వాత బాధ్యతలు స్వీకరించిన తాత్కాలిక ప్రభుత్వాన్ని యూనస్ నడుపుతున్నారు. ఆ ప్రభుత్వంలో పలువురు విద్యార్థి  నేతలు ఉన్నారు. వీరంతా పదవులకు రాజీనామాలు చేసి బయటకు వచ్చారు.                

భారత్ లో ప్రవాసంలో ఉన్న హసీనా               

గణతాంత్రిక్ ఛత్ర సంసద్‌లో గతంలో హసీనా అవామీ లీగ్  చెందిన యువజన విభాగానికి అనుబంధంగా ఉన్న విద్యార్థులు కూడా ఉండేవారు. వారందర్నీ ఇప్పుడు తప్పించినట్లుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ పరిస్థితి రాను రాను దుర్భరంగా మారుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పారిపోయేలా చేసిన విద్యార్థి నేతలు ఇప్పుడు యూనస్ ప్రభుత్వంపైనా అంత నమ్మకంగా లేరు. సొంత పార్టీ పెట్టుకున్నారు. మరో వైపు ఎన్నికలు  నిర్వహించాలనుకుంటున్నారు. కానీ హసీనా పార్టీని పోటీ చేయకుండా చూడాలని అనుకుంటున్నారు. షేక్ హసీనాపై అనేక కేసులు పెట్టారు. ఒక వేళ ఆమె  బంగ్లాదేశ్ కు వెళ్లే ఉరిశిక్ష వేస్తామన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు.          

స్టూడెంట్ పార్టీతో బంగ్లాదేశ్ లో మరింత గందరగోళం               

హసీనా ఇండియాలోనే ప్రవాసంలో ఉన్నారు. ఆమె ఇండియాలో ఏ ప్రాంతంలో ఉన్నారో ఎవరికీ తెలియదు. అయితే ఇక్కడి నుంచి ఆమె బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సందేశాలు ఇస్తున్నారు.ఇలా ఇవ్వడంపైనా  అక్కడ విద్యార్థి నేతలు దాడులకు దిగుతున్నారు. ఎన్నికల సమయంలో విద్యార్థుల పార్టీ గెలిస్తే పర్వాలేదు కానీ.. గెలవకపోతే మరోసారి బంగ్లాదేశ్ మండిపోయే ప్రమాదం ఉంది. విద్యార్తి నేతలు భారత్ తో సన్నిహిత సంబంధాలు కోరుకోవడం లేదు..  అలాగే పాకిస్తాన్ నూ సన్నిహితంగా ఉండవద్దని అంటున్నారు. ప్రస్తుతం ప్రజలు ఎన్నుకున్న నేతలు లేకపోవడంతో బంగ్లాదేశ్ పరిస్థితి ఘోరంగా మారింది.