Ayodhya Holi Celebrations: అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించిన తరవాత వచ్చిన తొలి హోళీ పండుగ ఇది. అందుకే అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్నీ అందంగా తీర్చి దిద్దుతున్నారు. ఘనంగా హోళీ వేడుకలు చేసేందుకు ముస్తాబు చేస్తున్నట్టు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు. 


"ఈసారి అయోధ్య రాముడి సమక్షంలో హోళీ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి అయోధ్యకి భక్తుల తాకిడి పెరిగింది. అందరూ వచ్చి బాల రాముడిని దర్శించుకుంటున్నారు. ఈ భక్తుల రాకతో అయోధ్య సందడిగా మారింది"


- ఆచార్య సత్యేంద్ర దాస్, ప్రధాన పూజారి




అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఉత్సవం ఎంత ఘనంగా అయితే జరిగిందో అదే స్థాయిలో హోళీ వేడుకలు చేస్తామని ట్రస్ట్ వెల్లడించింది. ఈ సందర్భంగా రాముడికి ప్రత్యేక అలంకరణ చేయనున్నారు. బాల రాముడి విగ్రహానికి గులాల్‌ పూసి అందంగా ముస్తాబు చేయనున్నారు. ఆయనకు నైవేద్యంగా పూరీలు, కచోరి సహా ఇతరత్రా పిండి వంటలు సమర్పించనున్నారు. అదే ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తామని ఆలయ ట్రస్ట్ తెలిపింది. ప్రాణ ప్రతిష్ఠ తరవాత జరుగుతున్న తొలి వేడుకలు కావడం వల్ల అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు. ఈ ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం పూర్తైంది. అప్పటి నుంచి అయోధ్యకి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. బాల రాముడిని దర్శించుకుని మురిసిపోతున్నారు.