Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరం తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయనే దానిపై ఈ ప్రశ్నకు సమాధానంపై అనేక ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటన్నింటి మధ్య రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ఏబీపీ దేశంతో మాట్లాడుతూ.. "2024 జనవరి 15వ తేదీ అలాగే 24వ తేదీ జనవరి 2024 మధ్య శ్రీరామ చంద్రుడిని ప్రతిష్టించవచ్చని" అన్నారు. ప్రాణ ప్రతిష్ఠ చివరి రోజున ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపనున్నట్లు నృపేంద్ర మిశ్రా తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం భక్తుల కోసం రామమందిరం తలుపులు తెరుస్తామని వివరించారు. జనవరి 24, 25 2024 వరకు సాధారణ భక్తులు ఆలయాన్ని దర్శించుకోవచ్చని మిశ్రా తెలిపారు. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో జీవిత ప్రతిష్టను చూసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు.
గర్భగుడి ప్రధాన ద్వారం మీద బంగారు తాపడం..!
గర్భగుడి ప్రధాన ద్వారం బంగారంతో కప్పబడి ఉంటుందని దానిపై బంగారు చెక్కడం ఉంటుందని నృపేంద్ర చెప్పారు. 161 అడుగుల ఎత్తైన ఆలయ శిఖరానికి కూడా బంగారు పూత పూయనున్నట్లు వివరించారు. ఆలయ శంకుస్థాపన జరిగినప్పుడే అయోధ్యకు వెళతానని ప్రధాని తన మనసులో అనుకున్నారని.. అందుకే 2021 ఆగస్టు 5న ఇక్కడికి వచ్చానని చెప్పారు.
తప్పుడు వార్తలను ఖండించిన చంపత్ రాయ్..
ఇంతకు ముందు ఇరవై ఏళ్ల వరకు ప్రధాని మోదీ ఇక్కడికి రాలేదని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ అన్నారు. అతను అయోధ్య చుట్టూ చాలా సార్లు తిరిగారు కానీ ఇక్కడకు రాలేదని పేర్కన్నారు. రామ మందిర నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయనే దానిపై చాలాసార్లు తప్పుడు సమాచారం వచ్చిందన్నారు. రామ జన్మభూమి ట్రస్ట్‌కు చెందిన చంపత్ రాయ్ ఆ వార్తలను ఖండించారు. అంతకు ముందు రామ మందిర నిర్మాణం మూడు దశల్లో జరుగుతుందని నృపేంద్ర మిశ్రా గత నెలలో చెప్పారు. మొదటి దశ పనులు ఈ ఏడాదిలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు. మొదటి దశలో ఐదు మంటపాలు నిర్మిస్తామని, అందులో ప్రధానమైనది గర్భగుడి అని, అక్కడ రాంలాలా విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని చెప్పారు.
విగ్రహ తయారీ..
రాముడి విగ్రహ తయారీపై ప్రత్యేక దృష్టి సారించింది రామ మందిర ట్రస్ట్. దాదాపు ఆరడుగుల రాముడి విగ్రహాన్ని తయారు చేయించి...వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ప్రతిష్ఠించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే..ఈ విగ్రహ తయారీ కోసం ప్రత్యేక శిలలు తెప్పించింది. నేపాల్ నుంచి రెండు సాలగ్రామ శిలలను తరలించారు. ఇప్పటికే ఇవి అయోధ్యకు చేరుకున్నాయి. రామ మందిర ప్రాంగణానికి చేరుకోగానే పూజారులు, స్థానికులు ఆ శిలలకు ఘనస్వాగతం పలికారు. పూలతో అలంకరించారు. పూజలు చేశారు. ఆ తరవాత ఆ శిలలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అప్పగించారు. రాముడితో పాటు సీతా దేవి విగ్రహాన్నీఈ శిలతోనే తయారు చేయనున్నారు. గర్భాలయంలో ఈ రెండు విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. నేపాల్‌లోని కలి గండకి నదీ తీరంలో ఈ శిలలను సేకరించారు. వీటిని సీతాజన్మ స్థలిగా భావించే జానక్‌పూర్ నుంచి ప్రత్యేక క్రేన్‌ల ద్వారా అయోధ్యకు తరలించారు. ఈ రెండు సాలగ్రామ శిలల్లో ఒక దాని బరువు 18 టన్నులు కాగా...మరోటి 16 టన్నులు. విగ్రహ తయారీకి ఈ రెండు శిలలు అనువుగా ఉన్నట్టు అధికారులు నిర్ధరించారు.