Ayodhya Ram Mandir LIVE: రాముడు వివాదం కాదు, పరిష్కారం- మోదీ
Ayodhya Ram Mandir Opening LIVE Updates: అయోధ్య ఉత్సవానికి హాజరయ్యేందుకు ప్రముఖులంతా క్యూ కట్టారు.
శ్రీరాముడు విభజన కాదు పరిష్కారం. రాముడు అగ్ని కాదు శక్తి. రాముడు వర్తమానం కాదు శాశ్వతుడు. బానిసత్వ మనస్తత్వాన్ని విచ్ఛిన్నం చేసి, గతం నుంచి ధైర్యసాహసాలు తీసుకుంటూ ఎదిగిన దేశం ఇలాంటి కొత్త చరిత్రను సృష్టిస్తుందని మోదీ అన్నారు.
రామాలయంలో వేదికపై ఉన్న గోవింద్ దేవ్ గిరి జీ మహరాజ్ మాట్లాడుతూ ఇది ఆలయంలోని ఒక విగ్రహానికి జరిగిన ప్రతిష్ఠ కాదని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ కృషితో రామ్‌లల్లాను ప్రతిష్ఠ భాగ్యం దక్కిందన్నారు. రామ్ లల్లా ప్రతిష్ఠ కోసం ప్రధాని మోడీ కఠిన నియమాలను పాటించారని ఆయన అన్నారు. ప్రధాని మోదీకి రాజర్షి బిరుదు ఇచ్చారు.
ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ సాధువుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సాధువులు బహుమతిగా ఉంగరాలు అందజేశారు.
రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ఠాపన అనంతరం తొలి చిత్రాలు బయటకు వచ్చాయి.
ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య రామాలయం గర్భగుడిలోకి ఐదుగురికి మాత్రమే ప్రవేశం కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ అనందీబెన్ పాటిల్, ప్రధాన అర్చకుడు మాత్రమే గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేశారు.
అయోధ్య రామాలయంపై పూలవర్షం కురిసింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో సందర్భంగా రామాలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఉత్తర్‌ప్రదేశ్ సీఎంవో షేర్ చేసింది.
రామ్ లల్లా ప్రతిష్ఠ కోసం ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిరానికి చేరుకున్నారు. క్రీమ్ కలర్ కుర్తా, ధోతీ ధరించారు. రామ్లాలాకు వెండి గొడుగు తీసుకొని వచ్చారు. ప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రారంభమైంది. గర్భగుడిలో ఆయన పక్కనే పక్కనే మోహన్ భగవత్ ఉన్నారు.
రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంభర ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉమాభారతి, సాధ్వి రితంభర చాలా భావోద్వేగానికి గురై ఒకరినొకరు కౌగిలించుకుని ఏడ్చారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అయోధ్య రామాలయానికి చేరుకున్నారు.ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం అతిథులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అయోధ్యకు చేరుకున్నారు. వీరితో పాటు సైనా నెహ్వాల్, సీఎం యోగి, సచిన్ టెండూల్కర్, రాజ్ కుమార్ రావు, రామ్ చరణ్, చిరంజీవి వచ్చారు.
రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠా వేడుక కోసం అయోధ్యకు వెళ్లిన విక్కీ, కత్రినా
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠను పురస్కరించుకుని అమెరికాలోని న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో వేడుకలు జరిగాయి. ఇక్కడ భారతీయ కమ్యూనిటీకి చెందిన ప్రజలు గుమిగూడి సంబరాలు చేసుకున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా రామాలయంలా తలపించింది.
వైస్ ప్రెసిడెంట్ జగ్‌దీప్ ధన్‌ఖర్ X (గతంలో ట్విటర్‌లో) వేదికగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. "చారిత్రక నగరమైన అయోధ్యలో రామజన్మభూమిలో రామమందిర ప్రాణప్రతిష్ట ఈ యుగపుదినోత్సవానికి అభినందనలు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి 11 రోజుల కఠినమైన 'అనుష్ఠాన్' తర్వాత, అయోధ్యలో రామ్ లల్లా యొక్క ప్రతిష్టాపన వేడుకకు మార్గనిర్దేశం చేసే సాధువులు, దార్శనికుల సమక్షంలో పవిత్రమైన ఆచారాలను నిర్వచించారు. జనవరి 22 చరిత్రలో నిలిచిపోతుంది. చిత్తశుద్ధి, క్షమాగుణం, శౌర్యం, చిత్తశుద్ధి, వినయం, శ్రద్ధ, కరుణ వంటి విలువలను జ్ఞానోదయం, శాంతిని తీసుకురావడానికి జీవిత మార్గంగా తీర్చిదిద్దాలని సంకల్పిద్దాం. అని రాసుకొచ్చారు.
రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు నటుడు అనుపమ్ ఖేర్ అయోధ్య చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆయన హనుమాన్ గఢీ ఆలయాన్ని సందర్శించారు. శ్రీరాముడిని చూసే ముందు హనుమంతుడిని చూడటం చాలా ముఖ్యమని అన్నారు. అందుకే మొదట ఆయన్ని చూడ్డానికి వెళ్లాను. అయోధ్యలో ఎక్కడ చూసినా శ్రీరాముడు దర్శనమిస్తున్నాడు. మళ్లీ దీపావళి వచ్చేసింది అంటూ కామెంట్ చేశారు.
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. ఆహ్వానితుల్లో ఒకరైన లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఈరోజు ముంబై నుంచి అయోధ్యకు బయలుదేరి వెళ్లారు.
మెగాస్టార్ చిరంజీవి, రామచరణ్ ఫ్యామిలీతో అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠకు హాజరయ్యారు. ఇది చాలా కాలంగా ఎదురు చూస్తున్న మరుపురాని ఘటన అని దీనికి వెళ్తుండటం చాలా గర్వంగా ఉందన్నారు రామ్‌చరణ్.
బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ రామ్ మందిర ప్రతిష్ఠకు హాజరుకావడం లేదు. చల్లని వాతావరణం కారణంగా ఈ కార్యక్రమానికి ఆయన హాజరుకావడం లేదని తెలుస్తోంది. ఆరోగ్య రీత్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ప్రధాని మోదీ ఉదయం 10.25 గంటలకు అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10.45 గంటలకు అయోధ్య హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ఉదయం 10.55 గంటలకు రామాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.05-12.55 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ పూజలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
మరికొద్దిసేపట్లో రామ్ లాలా ప్రాణ్ ప్రతిష్ఠకు సంబంధించిన 16 ఆచారాలు ప్రారంభం కానున్నాయి.
అయోధ్యలో ప్రతిష్ఠాపనకు ఏడు అంచెల భద్రత. ఎస్పీజీ, ఎన్ఎస్జీ కమాండోలను మోహరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమర్చిన డ్రోన్లు ప్రతి మూలా నిఘా ఉంచుతున్నాయి.
ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు అనుభవజ్ఞులు అయోధ్యకు చేరుకోవడం ప్రారంభించారు. 7140 మంది అతిథులు హాజరవుతారని భావిస్తున్నారు.
- శ్రీ దేవకినందన్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీరామకథ
- ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 100 ప్రాంతాల సాంస్కృతిక ఊరేగింపు. వివిధ ప్రాంతాలకు చెందిన 1500 మంది జానపద నృత్య కళాకారులు, సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన జోనల్ కల్చరల్ సెంటర్లకు చెందిన 200 మంది కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.
- రామ్‌కథ పార్కులో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు రామ్‌లీలా ప్రదర్శన- సరయూ హారతి రామ్ కీ పైడిలో సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు- రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు రామ్ కీ పైడిపై ప్రొజెక్షన్ షో-
7 నుంచి 8 గంటల వరకు రామ్‌కథా పార్కులో వాటేకర్ సోదరీమణులు రామ్ గానం-
7 నుంచి 8 గంటల వరకు తులసి ఉద్యాన్‌లో భజన్
సాయంత్రం 7.30 నుంచి 7.45 గంటల వరకు లేజర్ షో
సాయంత్రం 7.45 నుంచి 7.55 గంటల వరకు రామ్ కీ పైడిలో ఎకో ఫ్రెండ్లీ బాణాసంచా -
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు రామ్ కథా పార్కులో కన్హయ్య మిట్టల్ భక్తి సాంస్కృతిక కార్యక్రమం
Ayodhya Ram Mandir looks from space: అంతరిక్షం నుంచి అయోధ్య నగరం ఫోటోలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో తీసింది. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ -NRSC ఈ చిత్రాలను విడుదల చేసింది.
ఫోటో క్రెడిట్ - NRSC
Ram Mandir Inauguration Live: భారత ఒలింపిక్ పతక విజేత షట్లర్ సైనా నెహ్వాల్ ఆదివారం ఉత్తరప్రదేశ్, అయోధ్యకు చేరుకున్నారు. సోమవారం అయోధ్యలో జరగనున్న రామమందిరం 'ప్రాణ ప్రతిష్ట' కార్యక్రమంలో పాల్గొనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావడం తన అదృష్టంగా భావిస్తున్నానని సైనా నెహ్వాల్ హర్షం వ్యక్తం చేసింది. సైనాతో పాటు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష, స్టార్ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వెంకటేష్ ప్రసాద్ అయోధ్యకు చేరుకున్నారు.
Ram Mandir Inauguration Live: అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడితో కలిసి అయోధ్యకు చేరుకున్నారు. జనవరి 22న మధ్యాహ్నం రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
Ram Mandir Inauguration Live: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని ఆదివారం రాత్రి సందర్శించారు. రేపటి ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముందు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
Ram Mandir Inauguration Live: అయోధ్యలో మరికొన్ని గంటల్లో రాముడి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. మొరాదాబాద్ లో రూ. 1,25,000 విలువైన రామమందిరం డిజైన్‌తో 18 క్యారెట్ల బంగారు ఉంగరం తయారుచేశారు.
Ram Mandir Inauguration Live: దేవుడి విషయంపై చర్చ పెట్టకూడదు అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ అన్నారు. రామమందిరం 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుకపై ఎంపీ డింపుల్ యాదవ్ మాట్లాడుతూ.. రాజకీయాలు వేరు, మతం అనేది వేరుగా ఉండాలన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం నాడు రాష్ట్రంలోని ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించడంపై తమిళనాడులో ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు. శ్రీరాముడి పేరిట భజన చేయడం, అన్న ప్రసాదాలు పంచడం, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, ఆంక్షలు కూడా విధించలేదని మంత్రి శేఖర్ బాబు పునరుద్ఘాటించారు. అయితే కేంద్ర మంత్రి పదవిలో ఉండి కూడా నిర్మలా సీతారామన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అన్నారు. ఉద్దేశపూర్వకంగా తమిళనాడు ప్రభుత్వంపై, డీఎంకే నేతలపై కేంద్రం బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటూ మండిపడ్డారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులపై తమిళనాడు ప్రభుత్వం, డీఎంకే నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అయోధ్యలో జరగనున్న ఈవెంట్ కు సంబంధించి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల్ని తమిళనాడు మంత్రి శేఖర్ బాబు తీవ్రంగా ఖండించారు. సేలంలో నిర్వహించిన డీఎంకే యూత్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి శేఖర్ బాబు మాట్లాడుతూ.. అయోధ్యలో వేడుక సమయంలో దేశ ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రామ మందిరం ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి నిషేధం విధంచలేదని స్పష్టం చేశారు.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అమెరికాలో దాదాపు 300 చోట్ల ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నారు. న్యూయార్క్‌లోని Times Squareతో పాటు మిగతా చోట్ల కూడా లైవ్ టెలికాస్ట్‌కి ఏర్పాట్లు చేశారు. అటు పారిస్‌లోనూ ఈఫిల్ టవర్ కూడా అయోధ్య ఉత్సవానికి సిద్ధమవుతోంది.
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) తమిళం, కన్నడ, హిందీ ఛానళ్లలో అయోధ్య వేడుకను ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. ఎస్వీబీసీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా అయోధ్యలో జరిగే వైదిక, ఆధ్యాత్మిక క్రతువులను నిరంతరాయంగా ప్రత్యక్షప్రసారం చేయనుంది.
దాదాపు 8 వేల మంది ప్రముఖులకు ట్రస్ట్ ఆహ్వానం పంపింది. వీళ్లలో చాలా మంది VIPలు ఉన్నారు. వీళ్లంతా ప్రైవేట్ జెట్స్‌లో అయోధ్యకి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఫలితంగా...ఈ ప్రైవేట్ జెట్స్‌కి డిమాండ్ అమాంతం పెరిగింది. వచ్చే వారమంతా ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా వరస పెట్టి ట్రిప్స్ బుక్ అయినట్టు ప్రైవేట్ జెట్ సర్వీస్ కంపెనీలు చెబుతున్నాయి.
రేపు (జనవరి 22) మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య కాలంలో ప్రాణ ప్రతిష్ఠ క్రతువు నిర్వహిస్తారు. మొత్తంగా 84 సెకన్ల పాటు ఇది కొనసాగుతుంది. ఇది పూర్తైన వెంటనే మహాపూజ, మహా హారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
బీజేపీ ఎంపీ, సినీ నటుడు రవి కిషన్ అయోధ్యకి చేరుకున్నారు. ఈ రెండు రోజులే కాకుండా ప్రపంచమంతా అయోధ్యకు క్యూ కడుతుందని అన్నారు. అయోధ్య నగరమంతా ఏదో తెలియని శక్తి నిండి ఉందని లక్షలాది మందికి అయోధ్య రాముడు ఉపాధినివ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
ప్రాణ ప్రతిష్ఠకు మరి కొద్ది గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో అయోధ్య ఆలయాన్ని అందంగా అలంకరించారు. విద్యుత్ దీపాల్లో మందిరం ధగధగా మెరిసిపోతోంది.
ఢిల్లీ నుంచి అయోధ్యకి వచ్చే ఫ్లైట్‌లో ప్రయాణికులు రామ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు. రాముడిని కీర్తిస్తూ భజనలు చేశారు.
ప్రముఖ సింగర్, మ్యూజిక్ కంపోజర్ శంకర్ మహదేవన్‌కీ అయోధ్య ఉత్సవానికి ఆహ్వానం అందింది. ఇప్పటికే ఆయన లక్నో చేరుకున్నారు. ఈ ఘట్టం కోసం మొత్తం ప్రపంచమే ఎదురు చూస్తోందని...ఇలాంటి వేడుకకు హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భారత దేశ చరిత్రలో ఇది ఎప్పటికీ నిలిచిపోతుందని వెల్లడించారు.
ప్రముఖ ఇండియన్ మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అయోధ్య వేడుకలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఇప్పటికే లక్నోకి చేరుకున్నారు.
అయోధ్య ఉత్సవం సందర్భంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కి చెందిన ఫోక్ డ్యాన్సర్స్ అయోధ్యకి చేరుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో తమ నృత్యాలతో అందరినీ అలరించనున్నారు.
తైవాన్‌లోని హిందువులు అయోధ్య సంబరాలు చేసుకుంటున్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూజలు, భజనలు నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకను ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ అయోధ్య వేడుకకు హాజరయ్యేందుకు లక్నో చేరుకున్నారు. 500 ఏళ్ల కల ఇన్నాళ్లకు సాకారమవుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అయోధ్య వేడుకకు హాజరవనున్నారు. ఇప్పటికే ఆమె లక్నో చేరుకున్నారు.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో మొత్తం 14 మంది దంపతులు పాల్గొంటారని ట్రస్ట్ వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా కొంత మందిని మాత్రమే ఆలయంలోకి అనుమతించనున్నారు.
అయోధ్య ఏర్పాట్లపై యూపీ డిప్యుటీ సీఎం బ్రజేశ్ పఠక్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేసే ఆ అపురూప ఘట్టం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. అందరూ ఆనందంలో తేలిపోతున్నారని చెప్పారు.
ట్రస్ట్ ఆహ్వానం మేరకు బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా కూడా అయోధ్యకు వచ్చారు. భార్య లిన్ లైష్రమ్‌తో కలిసి లక్నో ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. ఈ వేడుకను చూసేందుకు తాము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని, ఇది కేవలం ఓ మతపరమైన కార్యక్రమం కాదని అన్నారు.
ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అయోధ్యకి చేరుకున్నారు. అయోధ్య మునుపటిలా లేదని అంతా మారిపోయిందని అన్నారు. ఈ మార్పునకు కారణం యోగి ఆదిత్యనాథ్ అని ప్రశంసించారు. అందరూ ఇళ్లలో దీపాలు వెలిగించి రామనామ స్మరణం చేయాలని పిలుపునిచ్చారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ అయోధ్యకు చేరుకున్నారు. అక్కడే ఓ హోటల్ ఈ రాత్రి బస చేయనున్నారు. ఆయనతో పాటు అల్లుడు నటుడు ధనుష్ కూడా అయోధ్య వేడుకకు హాజరవనున్నారు.
ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి దాదాపు 8 వేల మంది అతిథులకు ట్రస్ట్ ఆహ్వానం పంపింది. వీళ్లలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులున్నారు. వీళ్లంతా ఒక్కొక్కరుగా అయోధ్యకు చేరుకుంటున్నారు.
అయోధ్య వేడుకకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. 13 వేల మంది భద్రతా బలగాలు అయోధ్య చుట్టూ పహారా కాస్తున్నాయి.
Background
Ayodhya Ram Mandir Inauguration:
జనవరి 22. ఈ తేదీ భారత దేశ చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజు. వందల ఏళ్ల నాటి వివాదాలకు తెరపడి అయోధ్య రాముడు (Ram Mandir Opening) ఆలయంలో కొలువుదీరే చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచే రోజు. ఎంతో మంది హిందువుల కల నెరవేరే రోజు. ఇప్పటికే అయోధ్యలో సందడి కనిపిస్తోంది. ఉత్సవానికి ముందు జరగాల్సిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ మొత్తం క్రతువులో అంత్యంత కీలకమైంది బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ. ఆ సమయం కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. అది పూర్తైన తరవాతే అయోధ్య రాముడు అందరికీ దర్శనమిస్తాడు. అప్పటి వరకూ రాముడి విగ్రహం ఓ శిల మాత్రమే. ప్రాణ ప్రతిష్ఠ (Ramlala Pran Pratishtha) జరిగిన తరవాత అదే ఆరాధ్యమూర్తి (Ayodhya Ram Mandir) అవుతుంది. అందుకే హిందూ ధర్మంలో ప్రాణ ప్రతిష్ఠ క్రతువుకి అంత ప్రాధాన్యత ఉంటుంది. పేరులోనే ఉంది...ప్రాణ ప్రతిష్ఠ అని. అంటే...అప్పటి వరకూ కేవలం ఓ బొమ్మగా ఉన్నా...ఒక్కసారి గర్భ గుడిలో ప్రతిష్ఠిస్తే అందులో ప్రాణం వచ్చి చేరుతుంది. అయోధ్య రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు పండితులంతా ఎంతో మేధోమథనం చేసి ఓ ముహూర్తాన్ని నిర్ణయించారు. జనవరి 22న మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య కాలంలో ఈ క్రతువు నిర్వహిస్తారు. మొత్తంగా 84 సెకన్ల పాటు ఇది కొనసాగుతుంది. ఇది పూర్తైన వెంటనే మహాపూజ, మహా హారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 22నే ఎంచుకోడానికి ఓ ప్రధాన కారణముంది. పురాణాల ప్రకారం ఇదే రోజున విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తాడు. అమృతం కోసం అటు దేవతలు, ఇటు రాక్షసులు క్షీరసాగరాన్ని మథిస్తున్న సమయంలో సముద్రంలోకి కుంగిపోతున్న మందర పర్వతాన్ని నిలబెట్టేందుకు విష్ణువు తాబేలు అవతారాన్ని ఎత్తాడు. ఈ ప్రపంచానికి ఆధారం ఈ కూర్మావతారం అని హిందూ ధర్మ విశ్వాసం. రాముడు విష్ణువు అవతారమే కదా. అందుకే..అదే రోజున అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ (Significance of Pran Pratishtha) చేయాలని పండితులు నిర్ణయించారు.
ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇటీవలే నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. పనులు మొదలు పెట్టినప్పటి నుంచి చాలా సమస్యలు ఎదురయ్యాయని, వాటన్నింటినీ దాటుకుని విజయవంతంగా నిర్మాణాన్ని పూర్తి చేశామని వివరించారు. ఈ సమస్యల్లో మొదటికి కూలీల కొరత. గతేడాది నవంబర్‌లో తన పాడ్‌కాస్ట్‌లో ఈ విషయం చెప్పారు నృపేంద్ర మిశ్రా. దీపావళి సమయంలో చాలా మంది కూలీలు ఇళ్లకు వెళ్లిపోయారు. అప్పుడు కూలీలు దొరకడమే కష్టమైపోయింది. నిర్మాణ పనులు ఆలస్యమవుతాయేమోనని ఆందోళన చెందినట్టు చెప్పారు మిశ్రా. డిసెంబర్ 31 నాటికి అంతా పూర్తి చేయాలని అప్పటికే టార్గెట్ పెట్టుకున్నారు. మొత్తం 3,500 మంది కూలీలు అప్పటికి అందుబాటులో ఉన్నారు. L&T సంస్థ నిర్మాణ పనులు చేపట్టగా...TATA సంస్థ వీటిని పర్యవేక్షించింది. కూలీలను రిక్రూట్ చేసుకునే బాధ్యతని L&T సంస్థే తీసుకుంది. వందల ఏళ్ల క్రితం ఇక్కడ సరయూ నది ప్రవహించడం వల్ల ఇంకా అక్కడి మట్టిలో ఆ వదులుదనం ఉన్నట్టు వివరించారు మిశ్రా. నిర్మాణం చేపట్టే క్రమంలో ఇంజనీర్లు ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు ఇదే. ఆ సమయంలోనే IIT చెన్నై సహకారం తీసుకున్నారు. 15 మీటర్ల లోతు వరకూ మట్టిని తవ్వి దాన్ని తొలగించి అక్కడ re-engineered soilతో నింపాలని సూచించారు. ఇదే 14 రోజుల తరవాత గట్టి పడుతుందని చెప్పారు ఎక్స్‌పర్ట్‌లు. వాళ్లు చెప్పినట్టుగానే అది రాయిలా తయారైంది. దానిపైనే ఆలయం నిర్మించారు. అయోధ్య వేడుకను ప్రపంచవ్యావ్తంగా లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్,కెనడా, ఫ్రాన్స్ సహా పలు దేశాల్లో హిందువులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -