Ram Mandir Pran Pratishtha:


గర్భగుడిలోనే పాత విగ్రహం..


ఈ నెల 22న అయోధ్య ఉత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ రోజే ప్రధాని నరేంద్ర మోదీ రామ్‌లల్లా విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. మొత్తం మూడు డిజైన్‌లలో రాముడి విగ్రహాన్ని తయారు చేయించిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అరుణ్ యోగిరాజ్‌ తయారు చేసిన విగ్రహాన్ని ఎంపిక చేసుకుంది. ఈ విగ్రహాన్నే మోదీ గర్భ గుడిలో ప్రతిష్ఠించనున్నారు. అయితే...ఈ ఉత్సవం తరవాత పాత రాముడి విగ్రహాన్ని ఏం చేస్తారన్న సందేహాలు ఎందరికో ఉన్నాయి. దీనిపై ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌ స్పష్టతనిచ్చారు. కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటికీ పాత విగ్రహాన్ని కూడా గర్భ గుడిలోనే ఉంచుతామని వెల్లడించారు. జనవరి 16 నుంచి ప్రాణప్రతిష్ఠకు ముందు జరగాల్సిన క్రతువులు మొదలవనున్నాయి. ఈ నెల 21 వరకూ అవి కొనసాగుతాయి. ఈ ఉత్సవానికి సంబంధించి మరి కొన్ని వివరాలు వెల్లడించారు చంపత్ రాయ్‌. 


"రాముడి కొత్త విగ్రహం గర్భగుడిలో ప్రతిష్ఠించినప్పటికీ పాత విగ్రహాన్నీ అక్కడే ఉంచుతాం. అభిజిత్ లగ్నంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. జనవరి 16 నుంచి క్రతువులు మొదలవుతాయి. జనవరి 21 వరకూ ఇవి కొనసాగుతాయి. ఈ కార్యక్రమాల్లో మొత్తం 121 మంది ఆచార్యులు పాల్గొంటారు. వీటన్నింటినీ ట్రస్ట్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. ప్రధాన ఆచారి గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్‌ వీటిని పర్యవేక్షిస్తారు"


- చంపత్ రాయ్, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సెక్రటరీ 


ప్రత్యేక భజనలు..


ప్రాణప్రతిష్ఠ జరిగిన తరవాత ఒకరి తరవాత ఒకరికి దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు చంపత్ రాయ్. ఆ రోజున దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను అలంకరించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక భజనలు, హారతి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పెద్ద స్క్రీన్‌లు పెట్టుకుని అంతా కలిసి ఈ అయోధ్య ఉత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించాలని కోరారు. ఆలయాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.