Ayodhya Ram Mandir Donations: జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం (Ayodhya Ram Mandir) ఎంతో ఘనంగా ముగిసింది. ఆ మరుసటి రోజు నుంచే భక్తుల సందర్శనకు అవకాశమిచ్చారు. ఆలయ నిర్మాణ పనులు ఇంకొన్ని మిగిలి ఉన్నాయి. ఇవన్నీ 2025 నాటికి పూర్తవుతాయని అంచనా. అయితే...ఇప్పటికీ అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు అంటే..జనవరి 23వ తేదీనే దాదాపు రూ.3 కోట్ల విరాళాలు వచ్చినట్టు ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. ప్రాణ ప్రతిష్ఠ ముగిసిన తరవాత 10 డొనేషన్ కౌంటర్‌లు ఏర్పాటు చేసినట్టు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ అనిల్ మిశ్రా తెలిపారు. జనవరి 23న కొందరు భక్తులు నేరుగా నగదు రూపంలో విరాళాలు ఇవ్వగా మరి కొందరు ఆన్‌లైన్‌లో డొనేట్ చేశారు. ఈ లెక్కంతా తీస్తే రూ.3.17 కోట్ల వరకూ జమైందని అనిల్ మిశ్రా వెల్లడించారు. ఆ ఒక్కరోజే 5 లక్షల మందికి పైగా భక్తులు రామ మందిరానికి (Ram Mandir) పోటెత్తారు. మరుసటి రోజు కూడా దాదాపు ఇదే స్థాయిలో భక్తులు వచ్చినట్టు ట్రస్ట్ వెల్లడించింది. అయితే...భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల దర్శనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ పద్ధతి ప్రకారం ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని శుభ్రంగా ఉంచే బాధ్యతను RSS తీసుకుంది. సంఘ్‌ వర్కర్స్‌ ఇప్పటికే రంగంలోకి దిగి ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు. అదే సమయంలో దర్శనానికి వచ్చిన భక్తులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. క్యూ లైన్‌లో వెళ్లేలా వాళ్లకు సూచనలు చేస్తున్నారు. ఇక నుంచి భక్తుల తాకిడి రోజురోజుకీ పెరిగే అవకాశాలున్నాయని ట్రస్ట్ అంచనా వేస్తోంది. 


భారీ విరాళాలు..


అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూరి విరాళం సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి అందించారు. వి దిలీప్ కుమార్ అనే డైమండ్ బిజినెస్ మ్యాన్ కుటుంబం రామయ్యకు తన వంతుగా 101 కేజీల బంగారాన్ని విరాళం ఇచ్చారు. ఆలయంలో నిర్మించిన తలుపులకు బంగారం పూత పూయడం తెలిసిందే. అయితే మార్కెట్‌లో ఉన్న ధర ఆధారంగా చూస్తే.. వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ ఫ్యామిలీ రామాలయానికి దాదాపు రూ.68 కోట్లు రామ మందిరం ట్రస్టుకు విరాళం అందించినట్లు తెలుస్తోంది. రామయ్య గుడి నిర్మాణానికి వచ్చిన భారీ విరాళం ఇదే. అయోధ్య రామ మందిర నిర్మాణానికి రెండో అతిపెద్ద విరాళాన్ని ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు అందించారు. రామ మందిరం కోసం మొరారీ బాపు రూ. 11.3 కోట్లను అందించారు. అమెరికా, బ్రిటన్, కెనడాలోని తన అనుచరుల విరాళాల ద్వారా నిధులు 8 కోట్లు రూపాయలు జమకూర్చినట్లు సమాచారం. సూరత్ కు చెందిన మరో వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ ఢోలాకియా రూ.11 కోట్లు విరాళం ఇచ్చారు. శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ వ్యవస్థాపకుడే ఈ డోలాకియా. 


Also Read: హనీమూన్‌కి గోవా తీసుకెళ్తానని అయోధ్యకి తీసుకెళ్లిన భర్త, విడాకుల కోసం కోర్టుకెళ్లిన భార్య