Australia Bondi Beach shooter family links with Hyderabad: ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ బాండీ బీచ్‌లో డిసెంబర్ 14 సాయంత్రం జరిగిన దారుణమైన షూటింగ్ ఘటనలో 15 మంది మరణించగా, 24 మందికి గాయాలయ్యాయి. దాడి చేసినవారిని తండ్రికొడుకులు అయిన సజీద్ అక్రమ్, నవీద్ అక్రమ్ గా గుర్తించారు. సజీద్ ఘటనాస్థలంలోనే పోలీసుల కాల్పుల్లో మరణించాడు. నవీద్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విరిద్దరూ మొదట పాకిస్తాన్ నుంచి వలస వచ్చారని అనుకున్నారు. కానీ వారు భారత్ లోని హైదరాబాద్ నుంచి వచ్చినట్లుగా తాజాగా గుర్తించారు.
సజీద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందినవాడు. 1998లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ క్రిస్టియన్ మహిళను పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబం అతనితో సంబంధాలు తెంచుకుందని ఇక్కడి అతని బంధువులు చెబుతున్నారు. సజీద్ తల్లి ఇప్పటికీ హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ అతను ఆమె గురించి ఎన్నడూ అడిగి తెలుసుకోలేదని సోదరుడు తనను సంప్రదించిన మీడియా ప్రతినిధులకు చెబుతున్నాయి. ఆస్తి పంపకాల కోసమే ఓ సారి సజీద్ హైదరాబాద్ వచ్చినప్పుడు సోదరులతో గొడవ పడినట్లుగా తెలుస్తోంది. అధికారులు కుటుంబాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మిగతా కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించనున్నారు. సజీద్ తండ్రి సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశాడు.
డిసెంబర్ 14న బొండి బీచ్ సమీపంలోని పార్క్‌లో హనుక్కా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇద్దరు షూటర్లు ఫుట్‌బ్రిడ్జ్ నుంచి కాల్పులు ప్రారంభించారు. ఒకరు నలుపు దుస్తులు, మరొకరు తెలుపు ప్యాంట్ ధరించి ఉన్నారు. దాడి మొదలై మూడు నిమిషాలకు 43 ఏళ్ల అహ్మద్ అల్-అహ్మద్ అనే వ్యక్తి ఒక షూటర్‌ను వెనుక నుంచి దాడి చేసి ఆయుధాన్ని లాగేశాడు. అతను గాయపడ్డాడు కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని "హీరో"గా కొనియాడుతున్నారు. పోలీసులు షూటర్లతో కాల్పులు జరిపి సజీద్‌ను అక్కడే చంపారు. నవీద్‌ను గాయపరిచారు. సజీద్‌కు ఆరు ఆయుధాలకు లైసెన్స్ ఉంది. దాడికి ముందు తండ్రి-కొడుకు ఫిలిప్పీన్స్‌కు వెళ్లి 28 రోజులు ఉన్నారు. ఆ ప్రయాణం దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఇస్లామిక్ స్టేట్ జెండాలు, బాంబులు దొరికాయి. దీంతో ఉగ్రవాద శిక్షణ కోసం వెళ్లి వచ్చారని అనుమానిస్తున్నారు.