Congo Flash Floods: 



కాంగోలో భారీ వరదలు 


రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే 200 మంది వరదల ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రాంతాల్లో వందలాది మంది గల్లంతయ్యారు. ఉన్నట్టుండి భారీ వర్షాలు కురవడం వల్ల కొన్ని చోట్ల నదులు ఉప్పొంగాయి. అనూహ్యంగా వచ్చిన వరదలకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే అవకాశం కూడా లేకుండా ఒక్కసారిగా ముంచుకొచ్చాయి. ప్రభుత్వమూ ముందస్తు హెచ్చరికలు చేయలేదు. రెస్క్యూ టీమ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ఆ వరదల ధాటికి సహాయం అందించడమూ కష్టమవుతోంది. ఎక్కడి నుంచో కొట్టుకొస్తున్న డెడ్‌బాడీస్‌ను గుర్తించి వాటిని బయటకు తీస్తున్నారు. ఇప్పటి వరకూ 203 శవాలు వెలికి తీసినట్టు అధికారులు వెల్లడించారు. నీళ్లలో కొట్టుకొస్తున్న శవాల్ని గుర్తు పట్టలేకపోతున్నారు. కొన్ని చోట్ల గ్రామస్థులు ఆదుకోండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమ వాళ్లెవరూ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరదల ధాటికి చాలా మంది గాయపడ్డారని ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటి వరకూ అధికారికంగా లెక్కలైతే వెల్లడించలేదు. వైద్యులకు కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోతున్నాయి. 






5 వేల ఇళ్లు గల్లంతు 


కలెహే ప్రాంతంలోని నదులను ఆనుకుని ఉన్న గ్రామాల్లోని ప్రజలు తిప్పలు తప్పడం లేదు. కొందరైతే మొత్తం కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరైపోయారు. గ్రామాలకు గ్రామాలే మట్టి దిబ్బలైపోయాయి. అసలు ఎవరి ఇల్లు ఎక్కడుంది..? ఎవరి వాళ్లు ఎక్కడున్నారు..? అన్న ఆనవాళ్లే లేకుండా పోయాయి. అన్నీ కోల్పోయి ఎక్కడో ఓ చోట నిలువ నీడ కోసం అల్లాడుతున్నారు. ఈస్ట్ ఆఫ్రికాలో ఈ మధ్య కాలంలో ఏదో ఓ ప్రకృతి విపత్తు ముంచుకొస్తోంది. వేలాది మంది ప్రాణాలు బలిగొంటోంది. తరచూ వరదలు ముంచెత్తుతున్నాయి. ఉగాండా, కెన్యాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. నేల కుంగిపోతోంది. కాంగో సరిహద్దు ప్రాంతాలన్నీ చెల్లాచెదుర వుతున్నాయి. ఇక్కడే దాదాపు 129 మంది ప్రాణాలు కోల్పోయారు. 5 వేల ఇళ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. కాంగో ప్రెసిడెంట్ ఫెలిక్స్ త్షిషెకెడి ఈ విపత్తుపై సమీక్ష జరుపుతున్నారు. వరదల కారణంగా చనిపోయిన వారికి నివాళిగా ఓ రోజు సంతాపం పాటించాలని ప్రకటించారు.