Bharat Jodo Yatra Conclusion: 


రాహుల్ కామెంట్స్..


శ్రీనగర్‌లో జరిగిన భారత్ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారీ మంచు కురుస్తున్నా...ఆ చలిలోనే ప్రసంగం కొనసాగించారు. యాత్రలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.


"జోడో యాత్ర ప్రారంభం అయ్యే ముందు నడవడం పెద్ద కష్టమేమీ కాదు అని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఇది చాలా తేలికైన పని అని అనుకున్నాను. ఆ తరవాతే అసలు విషయం అర్థమైంది" 
-రాహుల్ గాంధీ 


మంచు కురుస్తుండగా రాహుల్ పక్కన ఉన్న వాళ్లు ఆయనకు గొడుగు పట్టారు. ఆ గొడుగునీ పక్కన పెట్టేసి అలాగే ప్రసంగం చేశారు. 


"జోడో యాత్ర మొదలైన వారం రోజులకే నాకు మోకాళ్ల నొప్పులు వచ్చాయి. అప్పుడే నడవడం సులువే అన్న నా ఇగో అంతా మాయమై పోయింది. అలా పాదయాత్ర చేయడం ఎంత కష్టమో అప్పుడే తెలిసొచ్చింది. కానీ...ఎలాగోలా ఆ నొప్పిని తట్టుకున్నాను. ఎలాంటి భయం లేకుండా ముందుకు సాగిపోయాను" 


-రాహుల్ గాంధీ 


తన మోకాళ్ల నొప్పి తగ్గిపోటానికి కారణమేంటో కూడా ఓ ఆసక్తికర సంఘటనతో వివరించారు రాహుల్ గాంధీ. 


"నేను యాత్ర చేసే క్రమంలో ఓ బాలిక నా దగ్గరకు వచ్చింది. మీకు మోకాళ్లు నొప్పి లేస్తున్నాయని తెలుసు అని చెప్పింది. మీ మొఖంలోనే ఆ నొప్పి తెలుస్తోంది అని అంది. నేను మీతో పాటు నడవలేకపోవచ్చు. కానీ మా మనసు మాత్రం ఎప్పుడూ మీతోనే ఉంటుందని, మా అందరికోసం మీరు ఈ యాత్ర చేస్తున్నారని చాలా ప్రేమగా మాట్లాడింది. అప్పుడే నా నొప్పంతా మాయమై పోయింది. ఆ తరవాత మరో చిన్నారి నన్ను కలవడానికి వచ్చింది. వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేసే ఆ చిన్నారి నాతో పాటు కొంత దూరం నడిచింది. చలికి వణికిపోతోంది. వాళ్లు స్వెటర్‌లు వేసుకోలేదని అప్పుడే గమనించాను. ఆ చిన్నారిని చూసి చలించిపోయాను. నేను కూడా స్వెటర్ వేసుకోకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ ప్రయాణంలో ఎంతో మహిళలూ తమ దీన గాథల్ని నాకు వినిపించారు. " 


- రాహుల్ గాంధీ 










కశ్మీర్‌ ఏం మారలేదు - రాహుల్ 


కేంద్రంపైనా విమర్శలు చేశారు రాహుల్. మోడీ సర్కార్ చెబుతున్నట్టుగా జమ్ముకశ్మీర్‌లో పరిస్థితిలు ఏమీ చక్కబడలేదని, ఎప్పటిలాగే అశాంతి కొనసాగుతోందని అసహనం వ్యక్తం చేశారు.  పార్టీకి అండగా ఉన్న వారందిరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడం సహా...అసలైన సమస్యల్ని దేశ ప్రజల ముందుకు తీసుకురావడంలో భారత్ జోడో యాత్ర సక్సెస్ అయిందని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఈ మొత్తం యాత్రలో రాహుల్ గాంధీ 12 భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 100 వరకూ సమావేశాలు నిర్వహించారు. 13 ప్రెస్ కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేశారు. 


Also Read: 2002 Gujarat Riots: గుజరాత్ అల్లర్ల డాక్యుమెంటరీపై నిషేధాన్ని సవాలు చేస్తూ పిటిషన్ - విచారణకు సుప్రీంకోర్టు ఓకే