తెలంగాణ ప్రభుత్వం - రాష్ట్ర గవర్నర్ కి మధ్య విభేదాల వేళ వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఇంత వరకూ ఆమోదం పొందకపోవడంపై బీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. సోమవారం (జనవరి 30) లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయగా అందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ముందుగా లంచ్‌ మోషన్‌ పిటిషన్‌కు అనుమతి ఇవ్వాలని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్ ప్రసాద్‌, హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. రాష్ట్ర బడ్జెట్‌ డ్రాఫ్ట్ కాపీలకు గవర్నర్ ఆమోదం తెలపలేదని, మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉందని ఏజీ వివరించారు. ఆ లోపు గవర్నర్‌ ఆమోదం తెలపకపోతే బాగా ఇబ్బంది అవుతుందని ధర్మాసనానికి ఏజీ వివరించారు. 


ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌‌కి, రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్న ఈ వివాదంలో తాము ఎలా జోక్యం చేసుకుంటామని అన్నారు. ‘‘గవర్నర్ విధుల్లో కోర్టులు న్యాయ సమీక్ష చేయొచ్చా? కోర్టులు మరీ ఎక్కువ జోక్యం చేసుకుంటున్నాయని మీరే అంటారు కదా? అసలు ఈ వ్యవహారంలో గవర్నర్ కు కోర్టు నోటీసులు ఇవ్వగలదా? మీరే ఆలోచించండి’’ అని సీజే అన్నారు.


అయితే, లంచ్ మోషన్ పిటిషన్ కు కనుక అనుమతిస్తే పూర్తి వివరాలు చెప్తానని అడ్వకేట్ జనరల్ చెప్పడంతో ఆ పిటిషన్‌కు బెంచ్‌ అంగీకరించింది. అయితే పిటిషన్‌ రెడీగా ఉందా? అని  ధర్మాసనం ప్రశ్నించింది. రెడీగా ఉంటే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విచారణ చేపడతామని ఏజీకి స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు ఎలా ఉంటాయి? హైకోర్టు ఎలా స్పందిస్తుందనే దాని ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించనున్నారు.