కేంద్రం తీసుకువస్తోన్న మానిటైజేషన్ ప్లాన్ పై బంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ప్రకటన చూసి షాక్ అయినట్లు తెలిపారు. ఇష్టారీతిన అమ్ముకోవడానికి ఇవి భాజపా ఆస్తులు కావని ఘాటుగా స్పందించారు దీదీ.
కాంగ్రెస్ విమర్శలు..
మానిటైజేషన్ ప్లాన్ ను ఇప్పటికే కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఇలా ప్రైవేటీకరణ చేయడం తగదని కేంద్రానికి హితవు పలికింది. ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టి లీజ్ అంటూ మోదీ సర్కారు సాకులు చెబుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.
" మేం ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకం కాదు. కానీ మేం చేసిన ప్రైవేటైజేషన్ లో ఓ లాజిక్ ఉంది. లాభాల బాటలో ఉన్న సంస్థలు, ఎంతో మందికి బతుకు ఇస్తోన్న కంపెనీలను మేం ప్రైవేటీకరణ చేయలేదు. కానీ మోదీ సర్కార్.. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలనుకుంటుంది. ముఖ్యంగా ఓ రంగానికి సంబంధించి కొంత మంది వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఈ పాలసీ ఉంది. రైల్వే శాఖ ఓ పెద్ద పరిశ్రమ. లక్షల మందిని రవాణా చేస్తుంది.. కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తోంది. అలాంటి శాఖను ప్రైవేటీకరణ చేయడంలో అర్థం లేదు. పైగా ఈ వ్యవహారానికి 'లీజ్' అనే ఓ పేరు పెట్టి కేంద్రం సాకులు చెబుతోంది. "
అసలేంటి ఈ పాలసీ..
అసెట్ మానిటైజేషన్.. అంటే, ప్రభుత్వ ఆస్తులను డబ్బు రూపంలోకి మార్చుకోవడం. ఇందులో ఇప్పటికే పూర్తి అయిన మౌలిక సదుపాయాల పథకాలకు విలువ కట్టి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు. ప్రైవేటు రంగం వాటి అంతిమ వినియోగదారుల నుంచి ఆదాయాన్ని సమకూరుస్తుంది.