Assam Paper Leak:


అసోంలో పదో తరగతి పేపర్ లీక్..
 
అసోంలో పదో తరగతి ఎగ్జామ్ పేపర్ లీక్‌ అవడం సంచలనం సృష్టించింది. HSLC జనరల్ సైన్స్ క్వశ్చన్ పేపర్‌ లీక్ అయింది. రూ.3 వేలకు ఈ పేపర్‌ను విక్రయించినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా ఈ పేపర్‌ను అందరికీ పంపినట్టు డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ...ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని అన్నారు. ఈ లీక్‌ వెనక ఉన్న అసలు సూత్రధారిని గుర్తించామని చెప్పిన ఆయన...మొత్తం ముగ్గురు ఉపాధ్యాయులు కుమ్మక్కై ఈ నేరానికి పాల్పడినట్టు వివరించారు. 


"జనరల్ సైన్స్ ఎగ్జామ్ పేపర్‌ను ఒక్కో రేటుకి అమ్మేసినట్టు మా ప్రాథమిక విచారణలో తేలింది. రూ.100-రూ.3000 వరకూ విక్రయించారు. కొందరికి రూ.100కే అమ్మేశారు. ఇంకొందరికి రూ.200-300 వరకూ విక్రయించారు. ఒకరికైతే రూ.3 వేలకు ఇచ్చేశారు. ఇదంతా వాట్సాప్‌లోనే జరిగింది. ఇదంతా అసలు ఎక్కడ నుంచి మొదలైంది అనేది పరిశీలిస్తున్నాం. విచారణలో పురోగతి సాధించాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం."


- జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, డీజీపీ


ఆదివారం రాత్రి ఈ పేపర్ లీక్ అయింది. సీఐడీ ఈ కేసు విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. ఇందులో ప్రధాన నిందితుడిని పట్టుకునేంత వరకూ విచారణ వేగవంతంగా కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. వెంటనే పరీక్షను రద్దు చేసిన ప్రభుత్వం మార్చి 30న నిర్వహిస్తామని వెల్లడించింది.