Asaduddin On Modi :  యూనిఫాం సివిల్ కోడ్ అంశాన్ని ప్రధాని మోదీ భోపాల్ లో ప్రత్యేకంగా ప్రస్తావించిన అంశంపై మజ్లిస్ చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. పంజాబ్ వెళ్లి సిక్కులకు యూనిఫాం సివిల్ కోడ్ గురించి చెప్పాలని సవాల్ చేశారు. ఆ తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలన్నారు. జాతీయ సమైక్యత , భిన్నత్వం  గురించి ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని.. ఉమ్మడి పౌరస్మతి పేరుతో వాటికి విఘాతం కల్పించాలని ప్రధాని మోదీ అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. యూనిఫాం సివిల్ కోడ్ ద్వారా హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ చట్టాన్ని  రద్దు చేస్తారా అని సవాల్ చేశారు.  





 



భోపాల్‌లో మోదీ ఏమన్నాంటే ? 


త్రిపుల్ తలాక్ కోసం వాదించే వారు.. ముస్లిం ఓటు బ్యాంకు కోసం తాపత్రయ పడుతున్నారని, వారంతా ముస్లిం కుమార్తెలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ప్రధాని విమర్శించారు. త్రిపుల్ తలాక్ కేవలం మహిళలకు సంబంధించినది మాత్రమే కాదని, మొత్తం కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుందని అన్నారు. ఎంతో ఆశతో కుటుంబ సభ్యులు ఎవరితోనైనా పెళ్లి చేసుకున్న మహిళను త్రిపుల్ తలాక్ చెప్పి వెనక్కి పంపిస్తే ఆ తల్లిదండ్రులు, సోదరులు ఎంత ఒత్తిడికి, ఆందోళనకు గురవుతారో, ఎంత బాధ అనుభవిస్తారో మాటల్లో చెప్పలేమన్నారు. 
 


ముస్లిం కుమార్తెలను అణచి వేయడానికి స్వేచ్ఛ ఉండేలా కొందరు త్రిపుల్ తలాక్ అనే కత్తిని వేడాలదీయాలని అనుకుంటున్నారని ప్రధాని విమర్శించారు. అందుకే ముస్లిం సోదరీమణులు, కూతుళ్లు ఎప్పుడూ బీజేపీ వెంట, మోదీ వెంటే ఉంటారని పేర్కొన్నారు. పస్మండ ముస్లింలు రాజకీయాలకు బలి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొందరు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, బీజేపీ శ్రేణులు వెళ్లి ముస్లింలకు ఈ విషయాన్ని వివరించి వారికి అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా వారు అలాంటి వారి బారిన పడకుండా ఉంటారని అన్నారు. బీజేపీ అంతా అభివృద్ధి రాజకీయాలే తప్పా.. బుజ్జగింపు రాజకీయాలు చేయదని మోదీ చెప్పారు. రాష్ట్రంలో దళితులు, మహాదళితులు మధ్య చిచ్చు పెట్టి కుల రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 


 





 
 
'ఔర్ ఏక్‌బార్‌ మోదీ సర్కారు'


ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించడం ఖాయమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 2024లో  బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని విపక్ష పార్టీలు ఆందోళన చెందుతుండటం స్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మరోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చి తీరుతుందని అందుకే ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నట్లు విమర్శించారు.