Cheetah Extinction in India:
వేటకు వినియోగించే వాళ్లట..
దాదాపు 7 దశాబ్దాల తరవాత చీతాలు భారత్‌కు తిరిగి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వాటిని అధికారికంగా వదిలారు. వాటిని సంరక్షించి అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది మొదటి విజయం. రీఇంట్రడక్షన్ ఆఫ్ యానిమల్స్ (Reintroduction of Animals)లో భాగంగా భారత్ ఇలా చీతాలను నమీబియా నుంచి తెప్పించింది. ఈ క్రమంలోనే...అసలు చీతాలు భారత్‌లో ఎందుకు అంతరించిపోయాయన్న చర్చ జరుగుతోంది. 1952లో చీతాలను అంతరించిపోయే జంతువుల జాబితాలో చేర్చారంటే...వాటి సంఖ్య ఎంత దారుణంగా తగ్గిపోయిందో ఊహించుకోవచ్చు. అయితే...దీనిపై IFS అధికారి ప్రవీణ్ కస్వాన్ (Parveen Kaswan) ట్విటర్ ద్వారా కొన్ని వివరాలు వెల్లడించారు. ఫోటోలతో సహా 70 ఏళ్ల క్రితం పరిస్థితులను వివరించారు. కొన్ని వీడియోలు కూడా షేర్ చేశారు.
అదో స్టేటస్ సింబల్...
1930ల్లో చీతాలను వేటాడటం ఓ స్టేటస్ సింబల్‌గా భావించేవారు. అందుకే...లేదంటే వాటిని పెంచుకుని వాటితో వేరే జంతువులను వేటాడించేవారు. అటవీ అధికారి ప్రవీణ్ కస్వాన్ షేర్ చేసిన వీడియోలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మనం కుక్కల్ని పెంచుకున్నట్టుగా... అప్పట్లో చీతాలను పెంచుకునే వారు. నిజానికి...చీతాలకు, మనుషులకు మధ్య కాన్‌ఫ్లిక్ట్ చాలా తక్కువగా ఉండేదట. చాలా మంది వాటిని "Hunting leopards" గా పిలిచేవారు. వేట కోసం వీటిని ఎక్కువగా వినియోగించేవారు. చీతాలు మాత్రమే కాదు. కాస్త ప్రత్యేకం అనిపించే జంతువులన్నింటినీ అప్పటి రాజులు, బ్రిటీషర్లు వేటాడేవారు. అదిగో అలా మొదలైన వేట..క్రమంగా చీతాల సంఖ్యపై ప్రభావం చూపింది. అవి కనుమరుగవుతూ వచ్చాయి. 1939నుంచి ఇది మరీ ఎక్కువైంది. 1972లో Wildlife Protection Act వచ్చేంత వరకూ ఈ వేట అలాగే సాగింది. అంటే...దాదాపు 40 ఏళ్లపాటు వాటిని వేటాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రవీణ్ కస్వాన్ ట్విటర్‌లో షేర్ చేశారు. Wilderness Films India Ltd ఆర్కీవ్‌లోని ఫుటేజీని పోస్ట్ చేశారు. వీటితో పాటు మరికొన్ని ఫోటోలనూ షేర్ చేశారు. వేటాడే సమయంలో వాటిని ఎలా ఉసిగొల్పే వాళ్లు, ముందుగా వేటకు ఎలా సిద్ధం చేసేవారు అనే విషయాలన్నీ ఈ వీడియోలు, ఫోటోల్లో స్పష్టంగా కనిపించింది. 1875-76 లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇండియా టూర్‌కి వచ్చినప్పుడు చీతాలను వేటాడేందుకు వినియోగించారు. ఆ తరవాత 1921-22 మధ్య కాలంలోనూ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇదే విధంగా చీతాలను వేటకు ఉసిగొల్పారు. ఇలా క్రమంగా వాటిని హింసించడం వల్ల అవి అంతరించిపోయాయి.
సంరక్షించుకునే ప్రయత్నంలో భారత్..
ఇలా అంతరించిపోయిన చీతాలను తిరిగి భారత్‌లోకి ప్రవేశపెట్టి వాటిని సంరక్షించుకుని..జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలని భావిస్తోంది కేంద్రం. అందుకే...ప్రాజెక్ట్ చీతాలో భాగంగా వాటిని నమీబియా నుంచి తెప్పించింది. ఎన్నో దశాబ్దాల సంప్రదింపుల తరవాత ఇన్నాళ్లకు 8 చీతాలు భారత భూభాగంపై అడుగు పెట్టాయి. ప్రస్తుతానికి వాటిని ఎన్‌క్లోజర్స్‌లో ఉంచారు. ఇక్కడి వాతావరణానికి అవి అలవాటు పడేంత వరకూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. అయితే..వీటి సందర్శనకు మాత్రం ఇప్పట్లో ప్రజలకు అనుమతి లభించేలా లేదు. ప్రధాని మోదీ కూడా ఇదే విషయం చెప్పారు. కొన్ని నెలల తరవాత వీటిని సందర్శించేందుకు అవకాశముంటుందని, అప్పటి వరకూ ఎదురు చూడాలని సూచించారు.
Also Read: Tiger Attack in Manyam: పార్వతీపురం మన్యం జిల్లాలో పులి సంచారం- దాడిలో రెండు ఆవులు మృతి