Arvind Kejriwal on His Resignation: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై విడుదలై ప్రచారం మొదలు పెట్టారు. మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన తన రాజీనామా అంశాన్నీ ప్రస్తావించారు. చాలా రోజులుగా కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ వినిపిస్తోంది. సుప్రీంకోర్టులో ఈ మేరకు కొన్ని పిటిషన్‌లు కూడా దాఖలయ్యాయి. కానీ సుప్రీంకోర్టు వాటిని కొట్టేసింది. అది ఆయన వ్యక్తిగత నిర్ణయమని తేల్చి చెప్పింది. ఇన్ని రోజుల తరవాత బయటకు వచ్చిన కేజ్రీవాల్..ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడం గురించి మాట్లాడారు. తనను కుట్రపూరితంగా కేసులో ఇరికించారని,ఆ ఆరోపణలకు తలొంచి రాజీనామా ఎందుకు చేయాలని ప్రశ్నించారు. 


"ఈ ముఖ్యమంత్రి పదవి నాకు ఏ మాత్రం ముఖ్యం కాదు. నాపైన తప్పుడు ఆరోపణలు చేశారు. తప్పుడు కేసులో నన్ను ఇరికించారు. రాజీనామా చేసేలా ఒత్తిడి తీసుకొచ్చారు. ఇదంతా కుట్ర అని తెలుసు కాబట్టే నేను సీఎం పదవికి రాజీనామా చేయలేదు"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి


అటు బీజేపీ మాత్రం కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తోంది. అంత పెద్ద కుంభకోణంలో అరెస్ట్ అయి 50 రోజుల పాటు కస్టడీలో ఉన్నా ఆ పదవిలో ఎలా ఉంటారంటూ ప్రశ్నిస్తోంది. తనను బలవంతంగా గద్దె దింపేందుకే బీజేపీ ఇలా కుట్ర చేసిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతిపై ఎలా పోరాటం చేయాలో తనను చూసి నేర్చుకోవాలని తేల్చి చెబుతున్నారు. కీలక నేతలందరినీ కావాలనే జైలుకి పంపించి తమ పార్టీని అణిచివేయాలని బీజేపీ చూస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే ఆప్ పని అయిపోతుందని అనుకుంటున్నారని, అది సాధ్యం కాదని స్పష్టం చేశారు.  సౌత్ ఢిల్లీలో భారీ ర్యాలీ చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీని చాలా మిస్ అయ్యానని అన్నారు. జైల్ నుంచి విడుదల కాగానే నేరుగా ప్రజల వద్దకే వచ్చానని, తను బాగుండాలని ప్రార్థించిన వాళ్లందరికీ ధన్యవాదాలు చెప్పారు. 140 కోట్ల మంది ప్రజలు తమ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే అమిత్‌షా ప్రధాని అవుతారని చేసిన వ్యాఖ్యలూ సంచలనమయ్యాయి. దీనిపై అమిత్‌ షా తీవ్రంగా స్పందించారు. వచ్చే ఐదేళ్ల పాటు మోదీయే ప్రధానిగా ఉంటారని తేల్చి చెప్పారు. 


 






Also Read: Electoral Ink: చూపుడువేలుపై వేసే ఇంక్ బయట లభ్యమవుతుందా? అలా చేస్తే కఠిన చర్యలు - ఈసీ వార్నింగ్