Mohali-Like RPG Attack:


పోలీస్ స్టేషన్‌పై దాడిపై కేజ్రీవాల్ స్పందన..


పంజాబ్‌లోని తరన్‌తరన్‌ పోలీస్ స్టేషన్‌పై రాకెట్ ప్రొపెల్ట్ గ్రెనేడ్‌ దాడి జరగటం సంచలనం సృష్టించింది. శాంతి భద్రతలపై పలు అనుమానాలకు తావిచ్చింది. అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైనప్పటికీ...అసలు ఈ దాడి ఎవరు చేశారన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. "కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఆప్‌ అధికారంలోకి వచ్చాక పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్‌లను వెనక్కి తగ్గారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీల అండలో ఉన్న వారినీ పట్టుకున్నాం. నిందితుల్ని వదిలిపెట్టం" అని వెల్లడించారు. డీజీపీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులు సమీక్షించారు. ఫోరెన్సిక్ టీమ్ రంగంలోకి దిగింది. "అర్ధరాత్రి 11.22 గంటలకు హైవే నుంచి ఆర్‌పీజీతో పోలీస్ స్టేషన్‌పై దాడి చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. సర్హాలీ పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన సువిధం సెంటర్‌పై ఈ దాడి జరిగింది. ఇప్పటికే దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. ఫోరెన్సిక్‌ బృందంతో పాటు ఆర్మీ కూడా రంగంలోకి దిగింది" అని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్వె ల్లడించారు. పూర్తి స్థాయిలో దీనిపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు అన్ని ఆధారాలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. లాంచర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ కుట్ర వెనక కచ్చితంగా పాకిస్థాన్‌ హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పంజాబ్‌ పోలీసులతో పాటు బీఎస్‌ఎఫ్, కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపడతారని అన్నారు. 






బీజేపీ ఫైర్..


తరన్‌తరన్ పోలీస్ స్టేషన్‌పై రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (RPG)తో దాడి జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది లో ఇంటెన్సిటీ బాంబు అని తెలిపారు. రాకెట్ లాంచర్‌ తరహా ఆయుధాన్ని పోలీస్‌ స్టేషన్‌పై విసిరినట్టు చెప్పారు. అమృత్‌ సర్ - బఠిండ హైవే పరిసరాల్లోని సర్హాలీ పోలీస్ స్టేషన్‌పై ఈ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. మజీందర్ సింగ్ సిర్సా పంజాబ్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. వరుస ట్వీట్‌లు చేశారు. "ఆప్ పంజాబ్ గుజరాత్, ఢిల్లీలో సంబరాలు చేసుకుంటోంది. సీఎం భగవంత్ మాన్ రాష్ట్ర శాంతి భద్రతలను గాలికొదిలేశారు" అని విమర్శించారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా కూడా ఆప్‌పై మండి పడ్డారు. 
"మున్ముందు ప్రమాదాలకు ఇదే హెచ్చరిక. పోలీసులపై దాడి చేయడం పంజాబ్ రాష్ట్ర శాంతి భద్రతలకు మంచిది కాదు. దీనిపై సమష్టిగా పోరాడాలి. కేంద్రంతో సహా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇలాంటి దాడులను నిర్లక్ష్యం చేయొద్దు" అని ట్వీట్ చేశారు. గతంలోనూ పంజాబ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. మొహాలీలోని పంజాబ్ పోలీస్‌ నిఘా విభాగం హెడ్‌క్వార్టర్స్‌పైనా రాకెట్‌ ప్రొపెల్డ్ గ్రెనేడ్‌తో దాడి జరిగింది.


Also Read: Gujarat Election Result: కోహ్లీ అయినా సరే ఆడిన ప్రతిసారీ సెంచరీ చేయలేడుగా - గుజరాత్ ఫలితాలపై భగవంత్ మాన్