Arrested Bangladeshi model digitally married Andhra Man : భారత్ లో అక్రమంగా ఉంటున్న  28 ఏళ్ల బంగ్లాదేశ్ మహిళ శాంతా పాల్, కోల్‌కతాలోని బిక్రమ్‌గఢ్ ప్రాంతంలో జులై 29, 2025న అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుండి స్వాధీనం చేసుకున్న పత్రాలలో బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్‌లు, రీజెంట్ ఎయిర్‌వేస్ (బంగ్లాదేశ్) ఉద్యోగి గుర్తింపు కార్డు, ఢాకా ఎడ్యుకేషన్ బోర్డు అడ్మిట్ కార్డు, రెండు నకిలీ ఆధార్ కార్డులు (ఒకటి కోల్‌కతా చిరునామాతో, మరొకటి బర్ద్‌వాన్ చిరునామాతో), ఓటరు ఐడీ,  రేషన్ కార్డు ఉన్నాయి.  ఆమె భారతదేశంలో చట్టవిరుద్ధంగా ఉండటానికి , విదేశాలకు ప్రయాణించడానికి ఈ నకిలీ పత్రాలను ఉపయోగించినట్లు పోలీసులుగుర్తించారు.  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్ మహ్మద్ అశ్రఫ్ అనే మెర్చంట్ నేవీ అధికారితో జూన్ 5, 2025న నకిలీ పత్రాలతో "డిజిటల్ వివాహం" చేసుకున్నానని శాంతా పాల్ వాదిస్తున్నారు.  ఈ వివాహం పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో రిజిస్టర్ చేశారు. డిజిటల్ వివాహం చేసుకున్నా  వీరిద్దరూ కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లో అద్దె అపార్ట్‌మెంట్‌లో నివసించారు. తర్వాత గోల్ఫ్ గ్రీన్‌కు మారారు.  అశ్రఫ్   పాస్‌పోర్ట్‌ను శాంతా పాల్  తన వద్ద ఉంచుకున్నారు. 

శాంతా పాల్ 2023లో బంగ్లాదేశ్‌లోని బరిసాల్ నుండి చట్టబద్ధమైన పాస్‌పోర్ట్‌తో కోల్‌కతాకు వచ్చింది. ఆమె స్థానిక ఏజెంట్ సహాయంతో నకిలీ భారతీయ గుర్తింపు పత్రాలను  పొందారు.  ఆమె పార్క్ స్ట్రీట్‌లో అద్దెకు ఉన్న చిరునామాను ఉపయోగించి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటరు ఐడీ,  పాన్ కార్డు వంటి నకిలీ పత్రాలను సమకూర్చుకుంది. ఆమె రెండవ ఆధార్ కార్డు బర్ద్‌వాన్‌లోని గోపాల్‌పూర్ చిరునామాతో ఉంది. శాంతా ,  అశ్రఫ్ ఈ నకిలీ పత్రాలను ఉపయోగించి కోల్‌కతాలో ఆస్తులను కొనుగోలు చేశారు.  శాంతా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఫుడ్ వ్లాగ్ నడిపింది.  భారతీయురాలిగా అందరూ  నమ్మేలా చేయడానికి   భారతదేశ భద్రత , జాతీయవాదం గురించి పోస్ట్‌లు చేసింది. ఆమె ఒక పోస్ట్‌లో ఒక వ్యక్తి బంగ్లాదేశ్ గుర్తింపు ,  ఆధార్ కార్డు రెండూ కలిగి ఉన్నాడని "బహిర్గతం" చేసింది.  ఇదంతా  పక్కా ప్లాన్ తోనే  చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  

శాంతా పాల్ బంగ్లాదేశ్‌లో మోడల్‌గా, నటిగా,   రీజెంట్ ఎయిర్‌వేస్‌లో  ఉద్యోగిగా పనిచేసింది. ఆమె 2016లో ఇండో-బంగ్లా బ్యూటీ  పోటీల్లో  బంగ్లాదేశ్‌కు  ప్రాతినిధ్యం వహించింది .  2019లో మిస్ ఆసియా గ్లోబల్‌గా కిరీటం గెలుచుకుంది.   ఆమె తమిళం, బెంగాలీ సినిమాల్లో కూడా నటించింది .  శాంతా పాల్‌ను గోల్ఫ్ గ్రీన్ పోలీస్ స్టేషన్‌లో ఆమె భారతీయ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసినప్పుడు  అనుమానం రావడంతో పోలీసులు గుర్తించారు. ఆమె జన్మ ధృవీకరణ పత్రం అందించలేకపోవడం , కుటుంబ వివరాల గురించి సరైన సమాధానాలు ఇవ్వలేకపోవడం వల్ల లోతుగా ఆరా తీస్తే అసలు విషయం  బయటపడింది.