Prajwal Revanna Case Updates: కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగళూరులోని స్పెషల్ MP-MLA కోర్టు ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రజ్వల్‌ ఇండియా వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటర్‌పోల్‌ కూడా బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసింది. ఎక్కడ కనిపించినా వెంటనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. కానీ...ఇప్పటికీ ప్రజ్వల్ ఆచూకీ మాత్రం తెలియలేదు. ముగ్గురు మహిళలు తమను లైంగికంగా వేధించాడంటూ కేసు పెట్టారు. అయితే...మరో బాధితురాలు ప్రజ్వల్‌పై కేసు పెట్టింది. వరుస కేసులను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ కూడా నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే పని మనిషి కిడ్నాప్ కేసులో  హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్ అయ్యారు. ఆ తరవాత బెయిల్‌పై విడుదలయ్యారు. 


ప్రజ్వల్ రేవణ్ణ లైంగికంగా వేధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక్కసారిగా రాష్ట్రమంతా సంచలనం సృష్టించాయి. ఆ తరవాత బాధితులు కొంత మంది ముందుకొచ్చి ప్రజ్వల్‌పై ఫిర్యాదు చేశారు. తమని లైంగికంగా వేధించడమే కాకుండా వీడియోలు తీసి బెదిరించాడని చెప్పారు. ఈ కంప్లెయింట్స్‌ వచ్చిన వెంటనే ప్రజ్వల్‌ అదృశ్యమయ్యాడు. విదేశాలకు పారిపోయాడు. ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేకంగా సిట్‌ని నియమించింది. మహిళా కమిషన్ సిఫార్సుల మేరకు సిట్‌తో విచారణ కొనసాగిస్తోంది. ఇక ఈ కేసుపై ప్రజ్వల్ తాతయ్య, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ తొలిసారి స్పందించారు. ప్రజ్వల్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. అయితే...కొంత మంది కుట్ర చేసి ఈ కేసులో ఇరికించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఆరోపణల ఆధారంగా విచారణ చేపట్టం ప్రభుత్వం విధి అని వెల్లడించారు.